కొవ్వూరు/ తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వ్యవసాయం అమలులో మహిళల పాత్ర అభినందనీయమని బ్రెజిల్ బృందం ప్రశంసించింది. ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే క్రమంలో బ్రెజిల్, UAE, మరియు శ్రీలంకకు చెందిన 30 మంది ప్రతిష్టాత్మక నిపుణుల బృందం రెండవ రోజు (5 అక్టోబర్ 2025) కాపవరం, కురుకూరు మరియు ఎర్నగూడెం గ్రామాలను సందర్శించింది. ఈ పర్యటన రైతు సాధికార సంస్థ (RySS) మరియు నౌ భాగస్వాములు (NOW Partners) సంయుక్తంగా నిర్వహించారు.
నౌ పార్టనర్స్ వ్యవస్ధాపకులు వాల్టర్ లింక్ తో పాటుగా బ్రెజిల్ మంత్రిత్వ శాఖకు చెందిన థామస్ మరియు మారియో బ్రగా డి కూడా పాల్గొన్నారు.
పర్యటనలో ప్రతినిధుల బృందాన్ని రెండు బృందాలుగా విభజించి, ఆంధ్రప్రదేశ్ ప్రజాభాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ (APCNF) నమూనాలు, వినూత్న పద్ధతులు, మరియు ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళల కీలక పాత్రను పరిశీలించారు. మొదటి బృందం కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో సత్యనారాయణ నిర్వహిస్తున్న 13 ఎకరాల హార్టికల్చర్ పాలీక్రాపింగ్ క్షేత్రాన్ని సందర్శించి, డ్రాగన్, చెరుకు, అరటి, కంద మరియు బొప్పాయి వంటి పంటలను పరిశీలించింది. రైతుతో సంభాషిస్తూ, ప్రకృతి వ్యవసాయం లో అనుభవం, పంటల దిగుబడి, రసాయన వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గురించి వివరాలు తెలుసుకున్నారు. మొక్కల నాణ్యత మరియు ఆరోగ్యంను స్పష్టం చేసీ బ్రిక్స్ విలువను స్వయంగా పరిశీలించారు. అనంతరం, బృందం స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై, రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మార్చడంలో మహిళల పాత్ర, చేపడుతున్న చర్యలు, మరియు క్షేత్రస్దాయిలో మహిళ సంఘాల ఆవశ్యకతను తెలుసుకుంది. ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (ICRP) పార్వతి ద్వారా, మహిళలు ప్రతి రైతు కుటుంబంలో ప్రకృతి వ్యవసాయం విస్తరించేందుకు ఏ విధంగా సహకరిస్తున్నారు అనీ విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, రిసోర్స్ పర్సన్ల పాత్ర మరియు కృషిని బృందం ప్రశంసించింది.
అనంతరం, నాగిరెడ్డి కృష్ణారావు నిర్వహిస్తున్న A-గ్రేడ్ మరియు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ (IFS) వరిసాగు లో అంతరపంటలు, జీవవైవిద్యత, పంటల ఆరోగ్యం, మరియు పంటల ఏర్పాటు పై అవగాహన చెందారు. ఆ తర్వాత పి. గోపాలకృష్ణ నిర్వహిస్తున్న ఎనీ టైం మనీ (ATM) నమూనా సందర్శించి, నమూనా వివరాలు, పంటల ఏర్పాటు, జీవవైవిద్యత, పంట రకాలు, ఆదాయం మరియు వ్యయాలు తెలుసుకున్నారు. రెండవ బృందం దేవరపల్లి మండలం కురుకూరు గ్రామం లో జే. సతీశ్ నిర్వహిస్తున్న 5 ఎకరాలలో కొబ్బరి 5 అంతస్తుల నమూనాను పరిశీలించింది. ప్రధాన పంట కొబ్బరి లో అంతర పంటలుగా కోకో, వక్క, మిరియాలు, జాజికాయ, పైనాపిల్ సాగు విధానాలను పరిశీలించారు. రైతు ద్రవజీవామృతం తయారీ మరియు ఆటోమేటిక్ ఫిల్టర్ సిస్టమ్ ద్వారా ఎలా పంటకు అందచేస్తారో వివరించారు. కోకో బీన్ పంటను ప్రాసెసింగ్ చేసే విధానం, క్యాడ్బరీ సంస్థకు సరఫరా విధానం, ఆదాయ వ్యయాల సమాచారం వివరించారు. ప్రకృతి వ్యవసాయం లో అనుసరించే వినూత్న విధానాల కారణంగా వివిధ సంస్థలచే 3 అవార్డులను సొంతం చేసుకోవడం పట్ల రైతు సతీష్ ను బృందం ప్రసంశించారు. తదుపరి, భాస్కర్ రావు 5 ఎకరాల్లో సాగిస్తున్న పామ్ ఆయిల్ వ్యవసాయ క్షేత్రంను పరిశీలించి, ప్రధాన పంట పామ్ ఆయిల్, వైవిధ్య పంటలు, మరియు డ్రిప్ సిస్టమ్ ద్వారా ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్ల వినియోగం తెలుసుకున్నారు.
తరువాత, శ్రీ సాయి లక్ష్మి బయో రిసోర్స్ సెంటర్ ను సందర్శించి ఘన జీవామృతం తయారీ విధానంపై అవగాహన పొందారు. అదే గ్రామంలో కొయ్యలమూడి సోమాలమ్మ ఇంటి పరిసరాలలో 20 సెంట్ల విస్తీర్ణంలో సాగుచేయ తలపెట్టిన ఎనీ టైం మనీ (ATM) నమూనాలో బృంద సభ్యులు స్వయంగా మొక్కలను నాటారు. చివరగా ఎర్నగూడెం గ్రామంలో వరిలో మీథేన్ ఉద్గారాలను తగ్గించే వినూత్నసాగు ప్రక్రియ ఆల్టర్నేటివ్ వెట్ అండ్ డ్రై, రీసెర్చ్ ప్లాట్ సందర్శించి పర్యటనను ముగించారు. ఈ పర్యటన విజయవంతం కావడానికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సుధాకర్, జాకీర్, స్వాతి, హుమయున్, ప్రకాష్, హేమ సుందర్, మధుమోహన్ (అగ్రికల్చర్ ఆఫీసర్), నాగ ప్రమీల రాణి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు, ఉప వ్యవసాయ సంచాలకులు చింతా శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి గంగాధర్ రావు, హార్టికల్చర్ అధికారి రమేష్, వ్యవసాయ అధికారి కమల్ రాజ్ మరియు క్షేత్రస్థాయి సిబ్బంది పాలుపంచుకున్నారు.
Prajavartha Online Telugu News