-రూ.5,22,471 కోట్ల పెట్టుబడులు – 2,67,239 ఉద్యోగాలు
-గేమ్ ఛేంజర్ గా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024
-దిగ్గజ సంస్థల చూపు… రాష్ట్రం వైపు
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా నిలపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విశాఖలో రెండు రోజుల పాటు జరుగుతున్న సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో గురువారం నాడు మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో అనుభవం ఉన్న పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి గొట్టిపాటి పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల్లో దాదాపు రూ.5,22,471 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,67,239 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 13న రూ.2,94,787 కోట్ల విలువైన పెట్టుబడులు, 69,800 ఉద్యోగ అవకాశాలకు ఒప్పందాలు జరగడంతో పాటు, నవంబర్ 14న రూ.2,27,684 కోట్ల పెట్టుబడులతో పాటు సుమారు 1,97,439 ఉద్యోగ అవకాశాలు లభించాయని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు.
విండ్ – సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, బయోఫ్యూయల్స్, పంప్డ్ హైడ్రా స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టం, అగ్రివోల్టాయిక్స్ మరియు పునరుత్పాదక ఇంధన తయారీ వంటి ఆధునిక రంగాలలోనే ఎక్కువగా పెట్టుబడులు వచ్చినట్లు మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. దేశ విదేశాలకు సంబంధించిన పలు ప్రముఖ దిగ్గజ సంస్థలు ఈ పెట్టుబడుల్లో భాగమయ్యాయని ఆయన హర్షం చేశారు. దేశ పునరుత్పాదక ఇంధన రంగంలో గేమ్ ఛేంజర్ గా మారిన ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024 ద్వారానే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్రంపై పెట్టుబడిదారులకు మరింత విశ్వాసం పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం విశాఖ వేదికగా జరుగుతున్న లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత బలపరిచాయని మంత్రి చెప్పారు. దీంతో దేశంలోనే వేగంగా విస్తరిస్తున్న గ్రీన్ ఎనర్జీ , గ్రీన్ హైడ్రోజన్ కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా మారుతుందని మరోసారి మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ మాట్లాడుతూ… స్వర్ణాంధ్ర@2047 రోడ్‌మ్యాప్‌ను భారతదేశ నెట్ జీరో లక్ష్యాలతో అనుసంధానిస్తూ, గ్రీన్ హైడ్రోజన్‌ను రాష్ట్ర భవిష్యత్ ఇంధన లక్ష్యాలలో కీలక భాగంగా తీసుకుంటున్నామని తెలిపారు. “గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ – అమరావతి” తో ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయిలో క్లీన్ ఎనర్జీ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఎండీ నెడ్ క్యాప్ ఎండీ ఎం.కమలాకర్ బాబుఇంధన శాఖ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News