విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘణనంగా ప్రారంభమైంది.ఈసమ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజరైన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోది నేతృత్వంలో ఆర్ధికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ ఎదుగుతోందన్నారు.
సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందని ఆదిశగా కృషి జరుగుతోందని పేర్కొన్నారు.
ఏపీలో సుపరిపాలన,అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆచరిస్తోందని
అభివృద్ధికి,సంక్షేమానికి చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అని అన్నారు. చంద్రబాబు ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ సియంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దారని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ చెప్పారు.
రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీని అభివృద్ధి చేయడానికి అంతే శ్రద్ధ చూపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు సాధించడానికి చంద్రబాబు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులను ఒప్పిస్తున్నారన్నారు.
జీఎస్టీ సంస్కరణలు,మౌలిక సదుపాయాల కల్పన వంటివి దేశాభివృద్ధి దోహదం చేస్తున్నాయని తెలిపారు.
ఫుడ్ ప్రాసెసింగ్, బ్లూ, అగ్రి ఎకనామి ఇలా వేర్వేరు రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయని చెప్పారు. దేశంలో ఇ-గవర్నెన్సు, డిజిటల్ ఇన్ ఫ్రా ద్వారా వేగంగా సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.
టెక్నాలజీ నాలెడ్జి డ్రివెన్ ఎకానమీ సాధించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఉప రాష్ట్రపతి చెప్పారు.
దేశంలోనూ, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలందరికీ ఆయన పిలుపునిచ్చారు.రానున్న రెండు మూడేళ్లలో 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందన్నారు. అలాగే అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టంగానూ భారత్ ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశంలో 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనతో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తామని ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు.ప్రతి దేశంతోను భారత్ మైత్రినే కోరుకుంటుందని అంతా కలిసి ఎదుగుదాం అనే భావన భారతదేశానిదని ఆయన స్పష్టం చేశారు.ఇతరులకు నష్టం కలిగించటం కాదు, ప్రయోజనం కల్పించటం ద్వారా అభివృద్ధి సాధించాలనేది భారత్ నినాదమని ఉప రాష్ట్రపతి స్పష్టం చేశారు.
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని కావున పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయెల్ మాట్లాడుతూ
ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదు యావత్ భారత దేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారన్నారు.
విజనరీ సీఎం చంద్రబాబు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతీ బిడ్డా అదృష్టవంతుడేనని వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైనదే నాని పేర్కొన్నారు.
గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ నిలుస్తోందని స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని తెలిపారు.
2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ సాంకేతికంగా,ఆర్ధికంగా బలోపేతం అవుతోందని పియుష్ గోయల్ పేర్కొన్నారు.2047 నాటికి సుసంపన్నమైన దేశంగా భారత్ అవతరిస్తుందని ఆకాంక్షించారు.టెక్నాలజీ ద్వారా ఈ సుసంపన్నతను సాధిస్తామని అన్నారు.టెక్నాలజీ డెమొక్రటైజేషన్ అనే విధానాన్ని పాటిస్తూ అందరికీ దానిని చేరువ చేస్తున్నామన్నారు.భారత్ తెచ్చిన డిజిటల్ పేమెంట్ విధానాన్ని ఇప్పుడు చాలా దేశాలు అనుసరిస్తున్నాయని కేంద్రమంత్రి అన్నారు.
30 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని పియుష్ గోయల్ పేర్కొన్నారు.104 ఉప గ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిన దేశంగా మన సాంకేతికతకు గుర్తింపు వచ్చిందని తెలిపారు.
500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తున్నామని చెప్పారు.స్వేచ్ఛా వాణిజ్యం కోసం వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుని దానికి అనుగుణంగా వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు.
డిజిటల్ ట్రాన్ఫర్మేషన్ దిశగా, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరికీ ఆర్ధిక అభివృద్ధి దిశగా పయనిస్తున్నామని పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన పరిస్థితులు ఉన్నా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్దఎత్తున భారత్ ఆకర్షిస్తూనే ఉందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు.
అత్యంత పారదర్శకమైన విధానంలో వాణిజ్యం ఉండాలని మేం కోరుకుంటున్నామని అన్నారు.
వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు,సదస్సులకు వీలుగా ఢిల్లీలో భారత్ మండపం ఉన్నట్టే ఆంధ్రా మండపం నిర్మించడానికి మేం సిద్ధంగా ఉన్నామని పియుష్ గోయల్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దార్శనికత,ఆవిష్కరణ, ఉత్సాహం,ఆశయం,వృద్ధి,ఇదే విశాఖపట్నానికి నిర్వచనం అన్నారు.పెట్టుబడులకు ఏపీ సరైన వేదిక అనే అంశాన్ని ప్రతిబింబించేలా రెండు రోజుల CII భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అందరికీ అర్థమయ్యేలా ఏపీలో ఉన్న అపార అవకాశాలను వివరిస్థూ ఇక్కడ ఈ భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసిన ప్రముఖులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నట్టు చెప్పారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎపి మొదటి స్థానంలో ఉందని ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళుతున్నట్టు పేర్కొన్నారు.
సుమారు 72 దేశాల నుండి 2500 దేశ విదేశీ పారిశ్రామిక వేత్తలు,వ్యాపార వేత్తలు ఇక్కడకు రావడం ఆనందదాయకం అన్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా
ఏపీలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందన్నారు.ముఖ్యంగా
పోర్టులు,ఎయిర్ పోర్టులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం అవుతున్నాయన్నారు.
ప్రస్తుతం 7 ఆపరేషనల్ ఎయిర్ పోర్టులు ఉంటే కొత్తగా మరో 7 ఎయిర్ పోర్టులు నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
ఏరోస్పేస్,ఎయిర్ క్రాఫ్ట్ తయారీని కూడా ఏపీకి తీసుకువసతామని అన్నారు.
మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుతో పాటు అతిపెద్ద మార్కెట్‌కు పారిశ్రామికవేత్తలను కంపెనీలను చేరువ చేస్తున్నట్టు చెప్పారు. వివిధ రంగాల్లో
పెట్టుబడులకు నమ్మకమైన భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని అన్నారు.
అగ్రికల్చర్ నుంచి ఏరో స్పేస్ వరకూ వివిధ రంగాల్లో పెట్టుబడులు,యూనిట్లు ఏపీకి వస్తున్నాయన్నారు.
మరో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ దేశాభివృద్ధి విషయంలో ఎపి కిందికి పాత్ర పోషిస్తోందని అన్నారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ, ఏపీకి గ్రోత్ కారిడార్‌గా విశాఖ తయారు అవుతున్నాయన్నారు.
అమరావతి నిర్మాణం,విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంగా చేస్తున్నారన్నారు.ఎపికి వచ్చే
పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఏపీలోను కేంద్రంలోను డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని దాంతో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని తెలిపారు.ఎపిలో పెట్టుబడలు పెడితే వాటిని ప్రభుత్వ పెట్టుబడులుగా భావించి వారందరికీ అండగా నిలుస్తున్నామని అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఎపిలో చంద్ర బాబు బ్రాండ్‌తో ప్రగతి పరుగులు పెడుతోందన్నారు.
పెట్టుబడులకు ఎవరు ముందుకొచ్చినా మద్దతుగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు.550
పారిశ్రామిక పార్కులు ఏపీలో పెట్టుబడుల కోసం సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన మంచి ఇకో సిస్టమ్ ను అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు.
అదానీ పోర్ట్స్ సెజ్ ఎండీ కరణ్ అదానీ మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఆంధ్రప్రదేశ్ ఆధునికంగా మారుతోందన్నారు.
భారత దేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని దానికి
మార్గదర్శిగా సియం చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు.
ఏపీలో డేటా సెంటర్లు, ఓడరేవులు,సిమెంట్ ఉత్పత్తి తదితర రంగాల్లో అదానీ పెట్టుబడులు పెడుతోందని అన్నారు.
భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.ఎల్లా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ భారత్ ముందుకువెళ్తోందని తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించేలా దేశం ముందడుగు వేస్తోందని అన్నారు.
భాగస్వామ్యం,ఆవిష్కరణలు, విలువ ఆధారిత ఉత్పత్తులతోనే ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కృతం అవుతుందని అన్నారు.
కోవిడ్ లాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రపంచానికి వాక్సిన్ అందించగలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఆమె గుర్తు చేశారు.
లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలు,ముఖ్యమంత్రి చంద్రబాబు కలలకు అనుగుణంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందన్నారు.రాష్ట్రంలోని
వేర్వేరు ప్రాంతాల్లో లులూ గ్రూప్ అత్యాధునిక మాల్స్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోందన్నారు.
ఇంకా ఈకార్యక్రమంలో సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జి, సిఐఐ అధ్యక్షులు రాజీవ్ మెమాని,జిఎంఆర్ సంస్థ చైర్మన్ జీవితం రావు,బజాజ్ ఫైనాన్స్ సిఎండి సంజీవ్ బజాజ్,అపోలో ఆసుపత్రుల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శోభన కామినేని,భారత్ ఫోర్జ్ లిమిటెడ్ జెఎండి అమిత్ కళ్యాణి,టివిఎస్ మోటార్స్ సిఎండి సుదర్శన్ వేణు,సిఎస్ కె.ఎస్ విజయానంద్,పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ పారిశ్రామిక వేత్తలు,ఇతర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News