-మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం ఆయుష్ వైద్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్రానికి ఐదు ఆయుష్ హాస్పిటల్స్ మంజూరు చేయగా, అందులో భాగంగా తెనాలికి రూ.26 కోట్ల వ్యయంతో 50 పడకల ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఈ సందర్భంగా తెనాలిలోని కొత్తపేటలో ఉన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణాన్ని మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,“ఆయుర్వేదంతో ఆరోగ్యం సాధ్యమవుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్య సమస్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఆయుర్వేద వైద్యానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తెనాలికి 50 పడకల ఆయుష్ హాస్పిటల్ మంజూరు కావడం గర్వకారణం” అని అన్నారు.
సుమారు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలోనే, ఇప్పటికే ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కనే ఈ నూతన ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పాత భవనం శిథిలావస్థలో ఉండటంతో, ఆ ప్రాంగణాన్ని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వినియోగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈ నూతన ఆయుష్ హాస్పిటల్లో ప్రత్యేక అవుట్ పేషెంట్ (OP) విభాగం, 50 పడకల ఇన్ పేషెంట్ (IP) సౌకర్యం, ఆధునిక ల్యాబొరేటరీలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసే అవకాశమూ ఉందన్నారు.
తెనాలికి ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేసినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లకు తెనాలి ప్రజల తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
సామాన్య ప్రజలకు సులభంగా, అందుబాటులో ఉండే విధంగా ఆయుర్వేద వైద్య సేవలు అందించడమే ఈ ఆయుష్ హాస్పిటల్ ప్రధాన లక్ష్యమని, ఆధునిక వైద్యం తో పాటు సంప్రదాయ ఆయుర్వేదాన్ని ప్రజలకు చేరువ చేసే కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News