-విశాఖ వేదికగా దిగ్విజయంగా ఏడీటీవోఐ నేషనల్ ట్రావెల్ మార్ట్ – 2026 ముగింపు
-7 యాంకర్ హబ్‌లు, వెడ్డింగ్ టూరిజం, మైస్ పాలసీపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ టూరిజం విజన్-2047 లక్ష్యంగా రోడ్‌మ్యాప్ ఆవిష్కరణ
-వెడ్డింగ్ డెస్టినేషన్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు “వెడ్ ఇన్ ఆంధ్ర” క్యాంపెయిన్
-నేషనల్ ట్రావెల్ మార్ట్ విజయవంతంగా ముగియడంపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ (ఏడీటీవోఐ) సంయుక్తంగా విశాఖపట్నం వి కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఫిబ్రవరి 13,14 తేదీల్లో నిర్వహించిన నేషనల్ ట్రావెల్ మార్ట్ 2026 దిగ్విజయంగా ముగిసింది. ఈ క్రమంలో రెండవ రోజు పర్యాటక రంగ అభివృద్ధిపై అత్యంత కీలకమైన ప్యానెల్ చర్చలతో ఉత్సాహంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి వంటి 7 ప్రధాన యాంకర్ హబ్‌లను కేంద్రంగా చేసుకుని రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో ప్రధానంగా శక్తి పీఠాలు, అధ్యాత్మిక పర్యాటకంపై జరిగిన చర్చలో శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కేవలం భక్తి కోణంలోనే కాకుండా, పర్యాటకులకు కథలు,మెరుగైన మౌలిక సదుపాయాల ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంపై దృష్టి పెట్టారు. పర్యాటక రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, మహిళా గైడ్లు, మహిళల నేతృత్వంలోని హోమ్‌స్టేలను ప్రోత్సహించడం ద్వారా సమ్మిళిత అభివృద్ధిని సాధించాలని ప్యానెల్ అభిప్రాయపడింది. అంతేగాక కృష్ణా లోయను ప్రధాన బౌద్ధ కేంద్రంగా మార్చడం,అరకు వంటి ప్రాంతాల్లో గిరిజన యువతకు గైడ్లుగా శిక్షణ ఇచ్చి, హోమ్‌స్టేల ద్వారా వారికి ఉపాధి కల్పించాలని చర్చించారు.
ఈ సందర్భంగా పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మరియు ఏడీటీవోఐ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ టూరిజం విజన్ 2047పై రోడ్‌మ్యాప్‌ను ప్రవేశపెట్టారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను పర్యాటక సేవలలో అనుసంధానం చేయడం వంటివి ఇందులో కీలకాంశాలు. ఆంధ్రప్రదేశ్‌ను డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు (డెస్టినేషన్ వివాహాలు) కేరాఫ్ అడ్రస్‌గా మార్చేందుకు “వెడ్ ఇన్ ఆంధ్ర” క్యాంపెయిన్ మరియు ఆంధ్ర వెడ్డింగ్ మార్ట్ వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టనున్నారు. భారీ సమావేశాలు, ఈవెంట్లకు (మైస్) ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా “ఏడీటీవోఐ చాప్టర్ స్పీక్స్” పేరుతో జరిగిన ముగింపు సమావేశంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ మెగా టూరిజం మార్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని, పారిశ్రామిక వేత్తలు మరియు టూర్ ఆపరేటర్ల మధ్య కుదిరిన భాగస్వామ్యాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అజయ్ జైన్, ఆమ్రపాలి కాట, ఇతర అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలోనే ఏపీని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.నేషనల్ ట్రావెల్ మార్ట్ విజయవంతంగా ముగియడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఏపీలోని పర్యాటక అందాలను దేశ, విదేశీ పర్యాటకులకు పరిచయం చేసే అంశంపై దృష్టి పెడతామని తెలిపారు.
Prajavartha Online Telugu News