రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త :
రంజాన్ పర్వదినాల సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముస్లిం సోదరుల కోసం ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫారుక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడప జిల్లా సీనియర్ మైనారిటీ నాయకులు అమీర్ బాబు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పర్వదినాల సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాయచోటి నియోజకవర్గం నుంచి వేలాది మంది ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం తమకు భాగ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు మత సామరస్యాన్ని, సోదరభావాన్ని మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి తెలిపారు. మైనారిటీల విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ముస్లిం మైనారిటీల కోసం షాది ఖానాల నిర్మాణం, స్మశాన వాటికలకు ప్రహరీ గోడలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
సమాజ అభివృద్ధికి మత సామరస్యమే బలమని, హిందూ–ముస్లింలు ఐక్యంగా ముందుకు సాగితేనే ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రులు పిలుపునిచ్చారు. ఈ ఇఫ్తార్ విందులో హిందూ, ముస్లిం సోదరులు కలిసి పాల్గొనడం సామాజిక ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఎం.డి. ఫారుక్ మాట్లాడుతూ రాయచోటి ప్రాంత ప్రజలతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. గతంలో ఈ ప్రాంత ప్రజల ప్రేమాభిమానాలను పొందిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. దివంగత నేత ఎన్టీ రామారావు పాలనలో రాయచోటి అభివృద్ధి దిశగా పలు కీలక కార్యక్రమాలు అమలయ్యాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, మత పెద్దలు, యువత, అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Prajavartha Online Telugu News