-పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి. దామోదర్ నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పాల కల్తీని అరికట్టడానికి, వినియోగదారులకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించడానికి పాల వ్యాపారంలో ఉన్న వారందరూ తప్పనిసరిగా FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) గుర్తింపు పొందాలని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి. దామోదర్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాల సహకార సంఘాల సభ్యులు కాని పాల ఉత్పత్తి దారులు, విక్రయదారులు ఎవరైనా సరే, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ముందు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( FSSAI )లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండటం తప్పనిసరి అని ఆయన అన్నారు. ఇటీవల వెలుగు చూసిన పాల కల్తీ ఘటనల దృష్ట్యా, పాలు,పాల ఉప-ఉత్పత్తుల సేకరణ, నిల్వ మరియు విక్రయాల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, విక్రయదారుల వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేస్తారన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించామన్నారు. పాలు,ఇతర పాల ఉత్పత్తుల విక్రయాల్లో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని పక్షంలో, తక్షణమే సమీపంలోని ఆహార భద్రతా అధికారికి (Food Safety Officer) ఫిర్యాదు చేయాలని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి. దామోదర్ నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఆ ప్రకటనలో కోరారు.
Prajavartha Online Telugu News