Breaking News

రాష్ట్రంలో ప్రతిరోజూ పండుగే..

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
-ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీలకు ప్రాధాన్యం
-బీసీలకు ఆర్థిక, రాజకీయ గుర్తింపు టీడీపీతోనే…
-బీసీ రక్షణ చట్టం తుది ముసాయిదా సిద్ధం
-త్వరలోనే చట్టానికి తుది రూపు
-జగన్ హయాంలో బీసీల హక్కులు భూ స్థాపితం : మంత్రి సవిత ధ్వజం
-నూజివీడులో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు సవిత, కొలుసు పార్థసారథి

నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతి రోజూ పండగేనని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆనందం వెలిబుచ్చారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. వడ్డెర్లను ఎస్టీలో చేర్చే విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బ్రిటీషర్ల దాష్టీకాలను ఎదిరించి… మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాటం జరిపిన యోధుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. ఓబన్న చేసిన పోరాటాన్ని ముందు తరాలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు. దీనిలో భాగంగా ఓబన్న జయంతిని అధికారికంగా, రాష్ట్ర పండుగగా నిర్వహించాలని శాశ్వత జీవో జారీచేశారన్నారు. గత సంవత్సరం గుంటూరులో, ఈ ఏడాది అనంతపురంలో ఓబన్న జయంతిని అధికారికంగా జరుపుకున్నామన్నారు. నూజివీడులో వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరించడం అభినందనీయమని మంత్రి సవిత కొనియాడారు.

ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీలకు ప్రాధాన్యం

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిందన్నారు. ఉగాది సందర్భంగా నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెబుతూ, జాబ్ క్యాలెండర్ విడుదల చేశారన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ పథకాలతో ఎక్కువగా లబ్ధి పొందేది బీసీలేనని మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతి రోజూ పండుగ వాతావరణమే ఉంటోందన్నారు. బీసీలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాలవేనన్నారు. బీసీ రక్షణ చట్టం తుది ముసాయిదా సిద్ధమైందని, త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు కేబినెట్ లో ఎనిమిది మంది బీసీ మంత్రులకు కీలక శాఖలు అప్పగించారన్నారు. కేంద్రమంత్రిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు రామ్మోహననాయుడికి అవకాశమిచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.

వడ్డెర్లకు చంద్రన్న వెన్నుదన్ను

వడ్డెర్ల సామాజిక వర్గీయులకు అన్నివిధాలా సీఎం చంద్రబాబు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో 15 శాతం రాయితీ కల్పించామన్నారు. వడ్డెరలకు మైనింగ్ లీజు రిజర్వేషన్లు రద్దు చేసిన ఘనుడు జగన్ అని విమర్శించారు. వడ్డెర్లను ఎస్టీలో చేర్చే విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

జగన్ హయాంలో బీసీల హక్కులు భూ స్థాపితం

అనంతరం తనను కలిసిన విలేకర్లతో మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి మంత్రి సవిత మాట్లాడారు. బీసీల అభ్యున్నతి కోసం అన్న ఎన్టీఆర్ విశేష కృషి చేశారన్నారు. బీసీలకు సీఎం చంద్రబాబు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. జగన్ హయాంలో బీసీల హక్కులు భూ స్థాపితమయ్యాయన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించి శభాష్ అనిపించుకున్న మంత్రి నారా లోకేశ్ త్వరలో మరో డీఎస్సీ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారన్నారు. మహిళల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. దీపం 2, స్త్రీ శక్తి, తల్లికి వందనం వంటి ఎన్నో పథకాలు అమలుచేసి, మహిళా పక్షపాతినని సీఎం చంద్రబాబునాయుడు నిరూపించుకున్నారన్నారు. జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని మంత్రి సవిత మండిపడ్డారు.

అంతకుముందు నూజివీడుకు వచ్చిన మంత్రి సవితకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భారీ ర్యాలీ నిర్వహించి, గజమాలతో సత్కరించి అడుగడుగునా బ్రహ్మరథం పట్టాయి. మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి స్వాతంత్ర సమర యోధుడు, రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రి సవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర్ల డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఈశ్వరరావు, డైరెక్టర్లు, ఉమ్మడి కృష్ణా జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘ ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వడ్డెర సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *