– పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి డిమాండ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో పరిశ్రమల భాగస్వామ్యం తక్కువగా ఉండటం వల్ల యువతకు అందుతున్న శిక్షణ అవకాశాలు తగ్గుతున్నాయనే అంశాన్ని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్, ప్రమోషన్ స్కీమ్ కింద తిరుపతి జిల్లాలో పరిశ్రమలు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకాల ద్వారా విద్యార్థులు చదువు పూర్తయ్యాక పరిశ్రమల్లో ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశాలు కల్పించాల్సి ఉండగా, స్థానికంగా పరిశ్రమల పాల్గొనడం పరిమితంగా ఉండటం వల్ల యువతకు నష్టం జరుగుతుందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ మాట్లాడుతూ, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కేవలం 28 కంపెనీలు మాత్రమే నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్, ప్రమోషన్ స్కీమ్ కింద నమోదు అయి ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని, ముఖ్యంగా నమోదు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా సులభతరం చేయడం, సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ విధానం అమలు చేయడం, అప్రెంటిస్ కాంట్రాక్టులు, స్టైపెండ్ చెల్లింపులు, మానిటరింగ్ వంటి ప్రక్రియలను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ప్రత్యేకంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ పథకాలలో సులభంగా భాగస్వామ్యం కావడానికి థర్డ్ పార్టీ అగ్రిగేటర్లను నియమించి, రిజిస్ట్రేషన్, కంప్లయన్స్, నిర్వహణ వంటి అంశాల్లో సహాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అదనంగా పరిశ్రమలు స్వయంగా బేసిక్ ట్రైనింగ్ అందించే అవకాశాన్ని కూడా కల్పించినట్లు చెప్పారు. ఈ పథకాల అమలును పర్యవేక్షించేందుకు మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేసినట్లు వెల్లడించారు. అప్రెంటిస్ అవకాశాలపై విద్యార్థులు, ఉద్యోగార్థులకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు, స్టేక్‌హోల్డర్ సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఎంపీ వ్యాఖ్య : అయితే తిరుపతి జిల్లాలో పరిశ్రమల భాగస్వామ్యం ఇంకా తక్కువగానే ఉండటంపై ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేస్తూ, స్థానికంగా మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించడం, యువతకు ఎక్కువ అవకాశాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పథకాల ద్వారా తిరుపతి జిల్లాలోని యువతకు మెరుగైన నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News