- ఏపీ రాజధాని సమస్యలో బీజేపీ కూడా ముద్దాయే
- సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇరాన్ పై ఇజ్రాయేల్ తో కలిసి అమెరికా చేస్తున్న యుద్ధం ప్రపంచ దేశాల్లో అనేక సమస్యలకు కారణం అవుతున్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక దాసరి భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి శంకర్ కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తూ పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. యుద్ధం ప్రారంభమై ఐదు వారాలు అవుతుందని, ఇరాన్ సుప్రీం నాయకుడు అయితుల్లా భోమినేని హతమార్చి, బాంబు దాడులతో 165 మంది పిల్లలను చంపి, జనావాసాలపై దాడులు చేస్తున్న ట్రంప్ ప్రపంచానికి ఏమి చెప్పాలనుకుంటున్నాడు? అని నిలదీశారు. వెనిజులా అధ్యక్షుడ్ని, అతని భార్యను కిడ్నాప్ చేసి నిర్బందించారని, క్యూబాకు చమురు అందకుండా ఆంక్షలు విధించి వేధిస్తున్నారని మండిపడ్డారు. క్యూబాపై ఆంక్షలను ఎకనామిక్ బాంబ్ గా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. రెజిమ్ ఛాంజ్ చేస్తాం, నేను చెప్పినవారే అధికారంలో ఉండాలి అనే తీరుతో ట్రంప్ యుద్ధాలు చేస్తున్నాడని ఆరోపించారు. ప్రపంచంలో ఇంత జరుగుతున్నా మోదీకి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఢిల్లీలో లక్షలాది మంది వలస కార్మికులు ఉపాధి దొరక్క, గ్యాస్ లభించక స్వగ్రామాలకు వెళుతున్నారని తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రతి వస్తువుపై రూ.5 నుంచి 10 రూపాయలు ధర పెరిగిందన్నారు. హెూటల్స్ మూతపడుతున్నారని చెప్పారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా యుద్ధాన్ని ఖండించలేని వ్యక్తి ప్రధానిగా ఉండటం సిగ్గుచేటన్నారు. యుద్ధంపై మోదీ వెంటనే స్పంచాలని డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబు యాడికి పర్యటనకు వెళ్లి రాయలసీను అభివృద్ధికి 200 టీఎంసీ నీళ్లు అవసరం ఉందని, గోదావరి నీళ్లు దాదాపు 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని వాటిని మళ్లించాల్సి అవసరంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేసి 30ఏళ్లు అవుతున్నా ఎప్పటికి పూర్తైతాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఇప్పుడు శ్రీకాకుళంలో వంశధార, నాగావళి నదుల నుంచి అనంతపురానికి నీళ్లు తీసుకెళతామని చంద్రబాబు కొత్త పాట అందుకున్నారన్నారు. 1995లో శంఖుస్థాపన చేసిన ప్రాజెక్టులను నిర్దిష్ట గడువులో పూర్తి చేస్తామని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. గోదావరి నీళ్లను రాయలసీమకు మళ్లించటం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. నేను తప్ప ఎవరూ లేదు, ఎవరూ చేయలేరనే ధోరణితో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కృష్ణా, గోదావరి అనుసంధానం త్వరగా పూర్తి చేయాలని, ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
రాజధాని అమరావతి విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీ స్పష్టంగా ఉందన్నారు. జగన్ ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు రాజధానిగా అమరావతే ఉండాలని, దానికి 30 వేల ఎకరాల భూమి అవసరం ఉంటందని జగన్ చెప్పినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాటమార్చితే ప్రజలు తిరస్కరించారని చెప్పారు. తరువాత ప్రజలు స్పష్టమైన తీర్పు కూడా ఇచ్చారని తెలిపారు. దేశంలో చాలా రాజకీయ పార్టీలు, పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన తరువాత అమరావతిని రాజధానిగా అంగీకరించాల్సి ఉంటుందన్నారు. వైసీపీ ఎంపీలు, జగన్మోహన్రెడ్డి వేరువేరు అభిప్రాయాలతో మాట్లాడటం మంచిది కాదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని, సీఆర్డీఏ భూములపై ప్రచార పిచ్చిని తగ్గించి పనులు చేయాలని హితవు పలికారు. రాజధానికి చట్టబద్ధత ఉందని, డబ్బులు ఉన్నాయని ఇక పనులు వేగంగా చేయాలని సూచించారు. జగన్ మూడు రాజధానులు అంటూ కొత్త సమస్యను తెచ్చిప్పుడు బీజేపీ నాయకులు ప్రధాని మోదీ శంఖుస్థాపన చేశారని మార్చటానికి వీలు లేదని చెప్పలేదని, కనీసం అమిత్ షా కూడా స్పందించలేదన్నారు. ఇప్పుడు రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం ఉందని బీజేపీ నేతలు నంగనాచి మాటలు మాట్లాడున్నారని ఎద్దేవ చేశారు. రాజధాని సమస్యలో బీజేపీ కూడా ముద్దాయేవని పేర్కొన్నారు. సిగ్గులేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నాయన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను నేరవేర్చాలని పార్లమెంట్ లో టీడీపీ, జనసేన, వైసీపీ నేతలు అడగటం మానేసి ఒకరినొకరు తిట్టుకుంటున్నారన్నారు.
Prajavartha Online Telugu News