– ఈ ప్రక్రియలో ఉత్సాహంతో భాగస్వాములుకండి
– అందుబాటులో https://se.census.gov.in పోర్టల్
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వీయ గణనతో దోషరహిత డేటాతో పాటు సమయం ఆదా అవుతుందని.. ప్రతిఒక్కరూ డిజిటల్ జన గణన తొలిదశలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్ – ఎస్ఈ)లో ఉత్సాహంగా పాల్గొని తమ ఇంటి నుంచే సమాచారాన్ని నమోదు చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు.
శుక్రవారం నగరంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో సెన్సస్-2027కు సంబంధించి ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెన్సస్–2027కు సంబంధించిన తొలి దశ (హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్)పై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాలన్నారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు వీలుకల్పించడం జరిగిందని.. ప్రజలు https://se.census.gov.in పోర్టల్ ద్వారా వివరాలను పొందుపరచాలన్నారు. 34 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిన అనంతరం 11 అంకెల విశిష్ట సంఖ్య (ఎస్ఈ ఐడీ) జనరేట్ అవుతుందని.. త్వరలో జరిగే డోర్ టు డోర్ సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఎస్ఈ ఐడీని వారికి చూపించడం ద్వారా డేటా పరిశీలన, ధ్రువీకరణ పూర్తవుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
Prajavartha Online Telugu News