-రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల ఉచిత సూర్యఘర్ కనెక్షన్లు మంజూరు
-విద్యుత్ రంగంలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి
-వచ్చే సీజన్ పూర్తి స్థాయిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
-మంత్రి గొట్టిపాటి రవి కుమార్
రాయదుర్గం, నేటి పత్రిక ప్రజావార్త :
పీఎం సూర్యఘర్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వినియోగదారులకు విద్యుత్ భారం తగ్గి, నిరంతరాయంగా విద్యుత్ అందుతుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలోని కాలనీలో ‘ప్రధాన మంత్రి సూర్యఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ శుక్రవారం నాడు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రగతి పండుగ’ కార్యక్రమంలో పాల్గొని రూ.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… పేద వర్గాలకు లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని రూపొందించాయన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ‘పీఎం సూర్యఘర్’ పథకం ద్వారా రూ.27 కోట్ల వ్యయంతో 2400 ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత సోలార్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం ద్వారా అయ్యే రూ.1.25 లక్షల ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తూ పూర్తి ఉచితంగా అందిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ పథకం ద్వారా ఓసీ వినియోగదారులకు రూ.78,000, బీసీలకు రూ.98,000 రాయితీ అందిస్తున్నామని అన్నారు. విద్యుత్ రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్బంగా మంత్రి గొట్టిపాటి రవి పేర్కొన్నారు. ముఖ్యంగా పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచేందుకు, రాష్ట్రం వ్యాప్తంగా 6 లక్షల ఉచిత సూర్యఘర్ కనెక్షన్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వయం సమృద్ధిగా ఉత్పత్తి చేసి విద్యుత్ వినియోగించుకునేలా ఇది ఒక కీలక ముందడుగు అని స్పష్టం చేశారు. ఈ వేసవి నాటికి ఈ 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడం మా లక్ష్యంగా అధికార యంత్రాంగం పని చేస్తోందని మంత్రి చెప్పారు. అలాగే, లో వోల్టేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు రాయదుర్గంలో 3 కొత్త సబ్ స్టేషన్లను మంజూరు చేశామని అన్నారు. ఇవి పూర్తయిన తర్వాత అక్కడి ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుంది. ఆర్డీఎస్ఎస్ పథకం కింద నూతన ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, పాత విద్యుత్ స్తంభాల మార్పిడి వంటి పనులు విస్తృతంగా చేపడుతున్నట్లు వివరించారు. దీని ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతుల కోసం, వచ్చే సీజన్ నాటికి వ్యవసాయ విద్యుత్ సర్వీసులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందేలా కృషి చేస్తున్నాం.
మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మహానేత అని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండటం రాష్ట్ర ప్రజలందరికీ అత్యంత ముఖ్యమని అన్నారు. సీఎం మరో 15 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు నిర్వహిస్తున్న హోమాలు, పూజలు, ప్రగతి పండుగ కార్యక్రమాలు నిజంగా ఆదర్శప్రాయమని కొనియాడారు. రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఎవరూ నిర్వహించలేదని, ఇలాంటి గొప్ప ఆలోచన రావడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమాలు ఆ మహానాయకుడిపై ప్రజలకు ఉన్న అపారమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారని గుర్తుచేసి, రాబోయే ఎన్నికల్లో మరింత రెట్టింపు మెజారిటీ సాధించాలని ఆకాంక్షించారు.
ఇదే సందర్భంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ…. రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన సంకల్పమని అన్నారు. ఆయన సహకారంతో గత 22 నెలల్లో రాయదుర్గం అభివృద్ధికి సుమారు రూ.800 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గానికి ఇవ్వనన్ని నిధులు రాయదుర్గానికి కేటాయించినందుకు కృతజ్ఞతగా 10 రోజుల పాటు చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.400 కోట్లు, రాయదుర్గం పట్టణ మంచినీటి అవసరాల కోసం రూ.78 కోట్లు కేటాయించారని వివరించారు. ముఖ్యమంత్రి క్షేమం కోరుతూ జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
అపూర్వ స్వాగతం..
నేమకల్లు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తదితరులకు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. గ్రామంలోకి ప్రవేశించగానే భారీ ఎత్తున బాలసంచ కాల్చుతూ, పులాభిషేకంతో స్వాగతం పలికారు. మరోవైపు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులకు ఆలయ పండితులు, నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి దీవెనలు తీర్థప్రసాదాలు అందజేశారు.
Prajavartha Online Telugu News