-రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా మార్చడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు
-ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి.. ప్రతి ఎకరాను సాగులోకి తీసుకొద్దాం
-ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ లక్ష్యాలు సుసాధ్యమవుతాయి
-గన్నవరం నియోజకవర్గం చిన్న అవుటపల్లిలో ఉపాధి హామీ కూలీల సమక్షంలో కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గం చిన్న అవుటపల్లిలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. రేషన్, పెన్షన్, ఉచిత బస్సు, తల్లికి వందనం వంటి పథకాల అమలు గురించి ఆరా తీశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నీటి నిర్వహణకు పెద్దపీట వేస్తున్నామని, అందుకోసం 100 రోజుల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఒకవైపు వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతోంది. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో నీటి కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ పరిస్థితిని చక్కదిద్దడం లక్ష్యంగా.. నీటి నిర్వహణ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గన్నవరం ప్రాంతంలో భూగర్భ జలాలు 200 అడుగుల కంటే దిగువకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటు భూగర్భ జలాలు 6 మీటర్లకు పెంచడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే వీలున్నంత వరకు రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకుంటున్నాం. సాగునీటి కాలువలను శుభ్రం చేసుకున్నాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో భూగర్భ జలాలు 265 టీఎంసీల వరకు పెంచాలని ప్రయత్నాలు చేపట్టాం. సముద్రంలో కలుస్తున్న నీటిలో కొంత మేర రాయలసీమకు తరలించినా ఆ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చే వెసులుబాటు కలుగుతుంది.
మొన్నటి వరకు గన్నవరం నియోజకవర్గం అంటే దోపిడీలు, పార్టీ కార్యాలయపై దాడులు, దుర్మార్గాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ నేడు అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగుతోంది. పరిశ్రమలకు కేంద్రంగా గన్నవరం నిలుస్తోంది. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో సుమారు 25 శాతం ఏపీకి రావడం చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు నిదర్శనం. రాయలసీమలో ఆటోమొబైల్, ఉత్తరాంధ్రలో అర్సెలార్ మిట్టల్, గూగుల్ డేటా సెంటర్ లాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నాం. అయినప్పటికీ.. వైసీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. వచ్చిన కంపెనీలను బెదిరించడం, పెట్టుబడిదారుల్ని తరిమేయడం లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారు. తల్లిని చెల్లిని గెంటేసినోళ్లు రాష్ట్రం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకునే యుద్ధంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.
Prajavartha Online Telugu News