Breaking News
??????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????

మోదీ, అమిత్‌షా ప్రజాస్వామ్య విధ్వంసకర చర్యలు

-మహిళా బిల్లు ముసుగులో రాజకీయ ప్రయోజనాలు
-చంద్రబాబు, నితీశ్‌కుమార్ ఎక్స్‌ట్రా ప్లేయర్లు
-దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం
-ప్రధాని హోదా దిగజార్చిన మోదీ
-త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తప్పదు
– సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామిక వ్యవస్థను విధ్వంసం చేసేలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ, అమిత్‌షాలు లౌకిక, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ దేశానికి, రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తుంటే, ఎన్డీఏలో కీలకంగా ఉండివారిని బలపరుస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, జెడి(యు) నేత నితీశ్‌కుమార్ ఎక్స్‌ట్రా ప్లేయర్లుగా నిలిచిపోయారని రామకృష్ణ ధ్వజమెత్తారు.
విజయవాడ దాసరి భవన్‌లో ఆదివారం రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. మహిళా బిల్లుకు విపక్షాలు అడ్డపడుతున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని తప్పుపట్టారు. ఒక్క మహిళా బిల్లునే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా, దానితోపాటు డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడంతోనే దక్షిణాది రాష్ట్రాల పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు గుర్తుచేశారు. పక్కా రాజకీయ ప్రయోజనాల కోసమే మహిళా బిల్లును మోదీ వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నితీశ్‌కుమార్, చంద్రబాబు సహకారంతో నిలబడుతోందని, దీంతో దక్షిణ ప్రాంత రాష్ట్రాలకు డీలిమిటేషన్ బిల్లుపై అన్యాయం జరుగుతుందని అన్ని రాష్ట్రాల నేతలు ధ్వజమెత్తారని, కానీ చంద్రబాబు, నితీశ్‌కుమార్ లు మౌనం దాల్చడం నిసిగ్గుగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా తమ పాత్రను పునః పరిశీలించుకోవాలని, కీలక విషయాల్లో స్పష్టమైన వైఖరి తీసుకోకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆ పదవి హోదాను, ఔనత్యాన్ని పూర్తిగా మంట గలపుతూ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాడు ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు, బీజేపీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న కాలంలో కూడా ఆ పదవికి తగిన ఔన్నత్యం చూపారని, ప్రస్తుతం ఆ స్థాయి మోదీలో కన్పించడం లేదన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదం పొందిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ, ఆ చట్టానికి అన్ని ప్రతిపక్షాలు మద్దతు తెలిపినట్లు వివరించారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఈ చట్టానికి 1996లో హెచ్‌డీ దేవగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో పునాది పడిందని, ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీ ఎంపీ గీతా ముఖర్జీ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. సీపీఐ ముందు నుంచీ ఈ మహిళా రిజర్వేషన్ల చట్టానికి మద్దతు ఇస్తోందన్నారు.
చట్టం ఆమోదం పొందిన తరువాత దాని అమలుకు కేంద్ర ప్రభుత్వం జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అనే రెండు షరతులను పెట్టిందని విమర్శించారు. ఈ షరతులు అమలుకు అడ్డంకులుగా మారుతున్నాయని, వాటిని తొలగించి వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ దేశ రాజకీయ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2011 జనాభా గణాంకాల ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం కలుగుతుందని, అదే సమయంలో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర భారత/హిందీ మాట్లాడే రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం లభించనుందని చెప్పారు. దీంతో ఆయా ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగే ప్రమాదముందన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరుతూ, ప్రతిపక్షాలన్నీ సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
2023 సెప్టెంబర్‌లోనే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఎవరైనా అడ్డుకోవడం సాధ్యమా అని ప్రశ్నిస్తూ, ఇప్పటికే ఆమోదం పొందిన చట్టంపై అడ్డంకుల ఆరోపణలు చేయడం తగదన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలన్నింటిలో ఈ అంశంపై స్పందన వ్యక్తమవుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు మౌనం వహిస్తున్నాయని విమర్శించారు. ప్రధాన రాజకీయ నాయకులు చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ ఈ కీలక అంశంపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయడం లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో స్పష్టమైన అన్యాయం జరుగుతోందని.. దక్షిణాది రాష్ట్రాలు గళమెత్తుతున్నప్పటికీ, రాష్ట్రంలోని నేతలు ఎందుకు స్పందించడం లేదంటూ సూటిగా ప్రశ్నించారు.
పార్లమెంట్‌లో చెప్పిన మాటలు అమలు కావాలంటే వాటికి నిబద్ధత అవసరమని, గత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా హామీ అమలుకాకపోవడం ఉదాహరణగా చూపించారు. జనాభా ప్రాతిపదికగా సీట్ల పునర్విభజన చేపడితే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని, దీనివల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం వంటి కీలక అంశంపై వారు ముందడుగు వేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆ దిశగా చర్యలు కన్పించడంలేదన్నారు. గతంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు ప్రస్తుతం తగిన స్థాయిలో స్పందించడం లేదన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ముడిపెడుతూ డీలిమిటేషన్ తెచ్చిన విధానంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. దిల్లీకి వెళ్లకుండా కేవలం విపక్షాలకు ఉత్తరాలు రాస్తూ ఉండిపోయారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలూ ఆలోచించాలని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా రాజకీయ నాయకులు ముందుకు రావాలని సూచించారు.
దీంతో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలసి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని స్పష్టం చేశారు. అదే సమయంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రజలు నిర్ణయం తీసుకోవాలని, తద్వారా కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని చారిత్రాత్మకంగా పేర్కొంటూ, అదే సమయంలో దాని అమలు విషయంలో సరైన నిబద్ధత కన్పించడంలేదని విమర్శించారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి చట్టాన్ని ఆమోదించడం వెనుక రాజకీయ ఉద్దేశం దాగి ఉందన్నారు. ప్రతిపక్షాలు సమగ్ర చర్చ కోసం అన్ని పార్టీల సమావేశం నిర్వహించాలని కోరినా, పరిమిత కాలంలోనే నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని అన్నారు. ఈ చట్టంపై పౌర సమాజం, ప్రజా ప్రతినిధులు, మీడియాతో విస్తృత చర్చ జరగలేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని ఆయన పునరుద్ఘాటిస్తూ… ఇప్పటికే ఆమోదించిన చట్టానికి అడ్డంకులు ఉన్నాయని చెప్పడం ద్వారా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, పి.దుర్గాభవాని, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *