-ఘనంగా ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
-అవగాహనతోనే అగ్ని ప్రమాదాల నివారణ – ప్రజల సహకారం కీలకం
-అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు (నార్త్)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ముగిశాయని అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు (నార్త్)
తెలిపారు. స్థానిక బందరు రోడ్డు లోని పివిపి షాపింగ్ మాల్ లో అగ్ని మాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు (నార్త్) మాట్లాడుతూ.. షాపింగ్ మాల్, వాణిజ్య సముదాయాలలో అగ్ని ప్రమాధాలపై భద్రతా చర్యలపై మాక్ డ్రిల్ చేపట్టామన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10,000కు పైగా కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా మాల్స్, ఆసుపత్రులు, పరిశ్రమల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించడం తో పాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. పాఠశాల విద్యార్థుల్లో అగ్ని భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు వ్యాస రచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేసినట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖలో సాంకేతిక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని, 55 మీటర్ల టర్న్ టేబుల్ లాడర్స్ వంటి ఆధునిక పరికరాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితుల్లో వేగవంతమైన సహాయక చర్యల కోసం డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతను కూడా వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో (ముఖ్యంగా ఐసీయూ), పరిశ్రమల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌లు, ఆక్సిజన్ సంబంధిత ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం పై శాఖ దృష్టి సారించిందన్నారు.
ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ ఆర్. జ్ఞాన సుందరం (సౌత్) మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాల నివారణకు మరియు ప్రమాద సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అగ్నిమాపక శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు, విద్యార్థులు మరియు వాణిజ్య సంస్థల సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని చెప్పారు.
అగ్ని ప్రమాదాల సమయంలో పొగ వల్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గినప్పుడు, ప్రాణాలను రక్షించుకునేందుకు తడి గుడ్డను ముక్కుకు అడ్డుగా ఉంచుకోవడం వంటి ప్రాథమిక రక్షణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
అగ్నిమాపక దళం 24/7 అందుబాటులో ఉండి, ప్రమాద సమాచారం అందిన వెంటనే సుమారు 3-8 నిమిషాల లోపు సంఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతుందన్నారు.
ఎత్తైన భవనాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు టర్న్ టేబుల్ లాడర్స్ (Turn Table Ladders), ఫైర్ టవర్ల సహాయంతో బాధితులను సురక్షితంగా బయటకు తరలించే సామర్థ్యాన్ని శాఖ పెంచుకుంది.
మల్టీ స్టోరీ భవనాలు, షాపింగ్ మాల్స్ మరియు ఇతర వాణిజ్య సంస్థల సిబ్బందికి క్రమం తప్పకుండా ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ మరియు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ముందస్తు జాగ్రత్తలు మరియు సరైన శిక్షణ ద్వారా అగ్ని ప్రమాదాలను గణనీయంగా అరికట్టవచ్చని ఆయన పేర్కొంటూ, ప్రజలు భయపడకుండా, ఎటువంటి సంకోచం లేకుండా అగ్నిమాపక శాఖ సిబ్బందికి సహకరించాలని, నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.
ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ఫైర్ సేఫ్టీ పరికరాలతో ఏవిధంగా వ్యవహరించాలో మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ ఏ.వి శంకర్ రావు,
వి ఎంసీ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News