గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి వాటిని నిర్దేశిత సమయంలోపు పరిష్కారం అయ్యేలా చూడాల్సిన బాధ్యత పి.యం.యు (ప్రాజెక్ట్ మోనిటరింగ్ యూనిట్) సిబ్బంది పై ఉందని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ అన్నారు. మంగళవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పి.యం.యు సిబ్బంది తో ప్రజల నుండి అందుచున్న పిర్యాదుల సత్వర పరిష్కారం పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తున్నాయని, ప్రజల వద్ద నుండి వచ్చే పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి, అవి నిర్దేశిత గడువులోపు పరిష్కారం అయ్యేలా సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. పిర్యాదులు పరిష్కారం చేసిన అనంతరం అవి పరిష్కారం అయింది లేనిదీ తనిఖీ చేసుకోవాలని, సదరు సమస్య పరిష్కారం అయింది లేనిదీ పిర్యాదుదారునికి ఫోన్ చేసి నిర్ధారించుకున్న తరువాత మాత్రమె కంప్లైంట్స్ రిజాల్వ్ చేయాలన్నారు. అలాగే జి.యస్.డబల్యూ, యు.యఫ్.యస్ సర్వే లను వేగవంతం చేయాలని సిబ్బంది ఆదేశించారు. త్రాగు నీటి పై అందే పిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, త్రాగు నీరు సరఫరా జరుగు సమయంలో అన్ని రిజర్వాయర్ల పరిధిలో మరియు పంపింగ్ స్టేషన్ల లో నూరు శాతం వాటర్ శాంపిల్స్ సేకరించాలని, అంతేకాక రిజర్వాయర్ల క్లీనింగ్ నిర్దేశిత సమయానికి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుధ్యంలో డ్రైన్స్ క్లీనింగ్ మరియు చెత్త తరలింపుల పై పిర్యాదు అందుతాయని వాటిని వెంటనే పరిష్కరించాలని, అలాగే డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరుశాతం జరగాలని అధికారులను ఆదేశించారు.
సదరు సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, సాంబశివరావు, డి.ఈ.ఈ కళ్యాణ్ రావు, పి.యం.యు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News