– వీవోఏలకు రు. 22.67 కోట్ల ప్రోత్సాహక నిధులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌లకు (VOA) రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వీవోఏలకు రు. 22.67 కోట్ల ప్రోత్సహాక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను మంగళవారం ఆదేశించారు. స్త్రీ నిధి ద్వారా విడుదల కావాల్సిన ఈ నిధులకు సంబంధించి మంత్రి కీలక సూచనలు చేచశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,336 మంది వీఏవోలకు లబ్ధి చేకూరనుంది. ఒక సంవత్సరానికి రు. 22.67 కోట్లను ప్రోత్సాహంగా విడుదల చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,336 గ్రామ సంఘాల్లో పనిచేసే వీవోఏలకు ఈ నిధులు ప్రోత్సాహకంగా అందజేస్తారు. ఇప్పటికే స్త్రీ నిధి ద్వారా గ్రామ సంఘాలకు 0.25 % ప్రోత్సాహకాలు ఇచ్చారు. స్వయం సహాయక సంఘాలు (SHGs) నుంచి వసూలైన వడ్డీ ఆధారంగా 0.75 % ప్రోత్సాహకాన్ని వీవోఏలకు ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో స్త్రీ నిధి రుణాల వసూలు, సంఘాల బలోపేతానికి వీవోఏలు అందిస్తున్న సేవలు కీలకమని మంత్రి కొండపల్లి పేర్కొన్నారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిధులు తక్షణమే గ్రామ సంఘాల ఖాతాల్లో జమచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Prajavartha Online Telugu News