– అందుబాటులో వెటర్నరీ మందులు, అనుబంధ ఉత్పత్తులు
– కేంద్రాల ఏర్పాటుకు కొత్తగా మూడు సొసైటీలకు అనుమతులు
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశుసంవర్ధక రంగ అభివృద్ధిలో కీలకమైన పశు ఔషధి విక్రయ కేంద్రాలు (పీఏవీకే) వన్ స్టాప్ సెంటర్లుగా సేవలందిస్తాయని.. వెటర్నరీ మందులతో పాటు అనుబంధ ఉత్పత్తులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
గురువారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లాస్థాయి ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. నందిగామ, తిరువూరు, మైలవరం పశువైద్యశాలల్లో పశు ఔషధి విక్రయ కేంద్రాల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతలున్న ప్రైమరీ షీప్ బ్రీడర్స్ కోపరేటివ్ సొసైటీ, రైతు ఉత్పత్తి సంఘాలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందించి పాడి రైతులకు పశువైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఔత్సాహిక సంఘాల ద్వారా పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని, బ్రాండెడ్ డ్రగ్స్‌తో పోల్చితే జనరిక్ ఔషధాలు 40 శాతం నుంచి 85 శాతం వరకు తక్కువ ధరకు లభిస్తాయని తెలిపారు. అర్హతలు కలిగిన ఫార్మసిస్టులను అందుబాటులో ఉంచడంతో పాటు మార్గదర్శకాల ప్రకారం అర్హతలున్న సంస్థలకు మాత్రమే పశు ఔషధి విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అనుమతలిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. ఈ కేంద్రాలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో కార్యకలాపాలు నిర్వహించేలా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
సమావేశంలో జిల్లా పశుసంవర్థక అధికారి డా. ఎం.హనుమంతరావుతో పాటు సహకార, డ్రగ్ కంట్రోల్, ఆర్ అండ్ బీ తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News