Breaking News

సీఎం చంద్రబాబు చొరవతోనే విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలు

-కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 500 మందికి పైగా నియామకాలు
-సీఎం సూచనల మేరకు విద్యుత్ కొనుగోళ్లు గణనీయంగా తగ్గించాం
-విద్యుత్ కొనుగోళ్లు పై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు
-ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగుతోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 18 మంది లబ్దిదారులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఇప్పటివరకు రాష్ట్ర విద్యుత్ శాఖలో 500కు పైగా కారుణ్య నియామకాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చొరవతోనే ఈ నియామకాలు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. కుటుంబాలను ఆదుకోవడం లక్ష్యంగా ఈ కారుణ్య నియామకాలు అమలు చేస్తున్నామని, అర్హులైన వారికి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… తాను విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఎక్కువ మంది కారుణ్య నియామ‌కాల కోసం త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వార‌ని గుర్తు చేశారు. కొంద‌రికి వ‌యో ప‌రిమితిలో బేధాలు ఉండ‌టంతో ఈ విష‌యాన్ని వెంట‌నే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు వివ‌రించారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు. కారుణ్య నియామ‌కాల విష‌యంలో వ‌య‌స్సు, ఎక్కువ అయినా త‌క్కువ అయినా., వ‌యో ప‌రిమితికి స‌డ‌లింపు ఇచ్చార‌ని పేర్కొన్నారు. ప్ర‌త్యేక డ్రైవ్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 500పైనే కారుణ్య నియామ‌కాలు చేప‌ట్ట‌గా, అందులో సుమారు 30 మందికి ప్ర‌త్యేక అనుమ‌తులు ఇచ్చామ‌న్నారు. అదే విధంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న విద్యుత్ ప‌నులు మ‌రింత వేగ‌వంతం కావ‌డానికి అవ‌స‌ర‌మైన ఉద్యోగుల నియామ‌కం విష‌యాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామ‌ని మంత్రి తెలిపారు. త్వ‌ర‌లోనే ఏఈ స్థాయిలో శాఖాప‌ర‌మైన నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక అభిమానంతో…

ప‌గ‌లూ, రాత్రీ తేడా లేకుండా విధి నిర్వ‌హ‌ణ‌లో పాల్గొనే విద్యుత్ శాఖ ఉద్యోగుల‌న్నా, ఆ శాఖన్నా.., సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌త్యేక అభిమాన‌మ‌ని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. అందుకే కారుణ్య నియామ‌కాల విష‌యంలో ప్ర‌త్యేక అనుమ‌తులు ఇచ్చార‌ని తెలిపారు. విద్యుత్ ప్ర‌మాద బాధితుల విష‌యంలోనూ త‌ప్పొప్పుల‌ను బేరీజు వేసుకోకుండా ఎంతో సానుకూల దృక్ప‌ధంతో ప‌రిహారం అందిస్తున్న‌ట్లు చెప్పారు. తుఫానుల‌ స‌మ‌యంలో ఎస్పీడీసీఎల్ నుంచి వ‌చ్చిన 1500 మంది సిబ్బంది గోదావ‌రి, విశాఖ జిల్లాల్లో ప్రాణాల‌కు తెగించి విశేష సేవ‌లందించార‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో 12,000 కొత్త‌ విద్యుత్ స్తంభాలు మార్చి.. 24 గంట‌ల్లోనే విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌రించ‌డం ఎంతో గొప్ప విష‌య‌మ‌న్నారు. సీఎం చంద్ర‌బాబు పాల‌న అనుభంతో రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌న్నారు. పెట్టుబ‌డులు, ప‌రిశ్ర‌మ‌ల రాక‌తో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా గ‌ణ‌నీయంగా పెరిగింద‌న్నారు. డిమాండ్ కు త‌గిన‌ట్టుగా విద్యుత్ శాఖ కూడా రికార్డు స్థాయి విద్యుత్ ఉత్ప‌త్తి న‌మోదు చేస్తోంద‌ని వివ‌రించారు. ముఖ్య‌మంత్రి సూచ‌న‌ల‌తోనే విద్యుత్ కొనుగోళ్ల‌ను కూడా త‌గ్గించామ‌న్నారు. ప్ర‌జ‌ల్లో 94 శాతం సంతృప్త స్థాయి ఉండేలా విద్యుత్ శాఖ ప‌నితీరు ఉండాల‌నేది సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీల‌ను పెంచిన వైసీపీ ప్ర‌భుత్వం ఆ ఛార్జీల‌ను ప్ర‌జ‌ల‌తో క‌ట్టించారని మంత్రి విమ‌ర్శించారు. లాభాల్లో ఉన్న విద్యుత్ శాఖ‌ను విధ్వంసం చేసిన వైసీపీకి విద్యుత్ శాఖ గురించి మాట్లాడే నైతిక‌ అర్హ‌త లేద‌ని తేల్చి చెప్పారు.

పూత‌ల‌ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలో ఉచిత‌ సోలార్ రూఫ్ టాప్ యూనిట్ల ప్రారంభం….

చిత్తూరు జిల్లా పూత‌ల‌ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలోని ఆకనంబట్టు HW ప్రాంతంలో ఎస్సీ కాల‌నీలో ఏర్పాటు చేసిన‌ ఉచిత సోలార్ రూఫ్ టాప్ యూనిట్ల‌ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ వినియోగ‌దారులంద‌రికీ సుమారు రూ.1.25 ల‌క్ష‌ల విలువైన‌ 2 కేవీ సామ‌ర్థ్యం క‌లిగిన సోలార్ రూఫ్ టాప్ యూనిట్ల‌ను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. పూత‌ల‌ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలోనే 4,200 ఇళ్ల‌కు ఉచిత సోలార్ బిగిస్తున్నామని దీనికి సుమారు రూ.52 కోట్ల‌కుపైగా ఖ‌ర్చు అవుతుంద‌న్నారు. పూత‌ల‌ప‌ట్టులోనే రూ.175 కోట్ల ఆర్డీఎస్ఎస్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు. సుమారు రూ.77 కోట్ల ప‌నులు ఇప్ప‌టికే పూర్త‌య‌ని చెప్పారు. విద్యుత్ శాఖ మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి సంబంధించి జ‌రుగుతున్న‌ ఆర్డీఎస్ఎస్ ప‌నుల‌తో ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి కూడా లాభ‌మేన‌న్నారు. రాబోయే మూడు, నాలుగు నెల‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కాల‌నీల్లో 6 ల‌క్ష‌ల ఉచిత సోలార్ క‌నెక్ష‌న్లు ఇస్తామ‌ని తెలిపారు. పీఎం కుసుమ్ ద్వారా రైతుల‌కు కూడా 9 గంట‌ల సోలార్ విద్యుత్ అందిస్తామ‌ని మంత్రి చెప్పారు. వ‌చ్చే వ్య‌వ‌సాయ సీజ‌న్ నాటికి పెండింగ్ లో ఉన్న‌ వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్లు పూర్తి చేస్తామ‌ని వెల్ల‌డించారు. లోడ్ త‌గ్గించేందుకు, లో ఓల్టేజ్ లేని నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా కోసం ఎస్పీడీసీఎల్ ప‌రిధిలో 65 స‌బ్ స్టేష‌న్ల నిర్మాణానికి ఈఆర్సీ అనుమ‌తులు తీసుకున్నామ‌న్నారు.

దేశం మొత్తం ట్రూ అప్… ఏపీలోనే ట్రూ డౌన్…

దేశం మొత్తం ట్రూ అప్ ఛార్జీల‌ను వ‌సూలు చేస్తున్నా., ఏపీలో ట్రూ డౌన్ చేసి ప్ర‌జ‌ల‌పై భారం లేకుండా చేశామ‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పెంచ వ‌ద్ద‌ని సీఎం చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేశార‌న్నారు. అవ‌కాశాన్ని బ‌ట్టి ఛార్జీల‌ను త‌గ్గించాల‌ని చెప్పార‌న్నారు. ఖ‌ర్చు త‌గ్గించుకుంటే ప్ర‌జ‌ల‌పై భారాలు త‌గ్గుతాయ‌న్న ముఖ్య‌మంత్రి సూచ‌న‌ల‌తో ముందుకు వెళ్తున్నామ‌న్నారు. లోడ్ ఉన్న ప్రాంతాల్లో లో ఓల్టేజ్ లేని., నాణ్య‌మైన విద్యుత్ అందించ‌డానికి రూ.6 వేల కోట్ల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా స‌బ్ స్టేష‌న్లు నిర్మిస్తుండ‌టంతో పాటు కొత్త లైన్లు వేస్తున్నామ‌న్నారు. ఆర్థిక‌ప‌ర‌మైన అడ్డంకులు ఉన్నా ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి హామీల‌ను నెర‌వేర్చామ‌న్నారు. రూ.34,000 కోట్లు సంక్షేమ‌ పెన్ష‌న్ల కోస‌మే ఖ‌ర్చు చేస్తున్నామ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే కొత్త పెన్ష‌న్లు కూడా అందిస్తామ‌ని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. అదే విధంగా విద్యార్థుల‌కు ఒకే రోజు రూ.10,000 కోట్ల‌కుపైగా త‌ల్లికి వంద‌నం ఖాతాల్లో జ‌మ చేసిన‌ట్లు చెప్పారు. శ్రీసిటీతో పాటు శ్రీకాళ‌హ‌స్తిలోనూ స‌బ్ స్టేష‌న్లు ప్రారంభించామ‌న్నారు. అదే విధంగా పూత‌ల‌ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలోని బంగారుపాళెంలో 132 కేవీ స‌బ్ స్టేష‌న్ కు 5 ఎక‌రాల భూమి కావాల‌ని, భూమి అందుబాటులోకి వ‌చ్చిన వెంట‌నే స‌బ్ స్టేష‌న్ నిర్మిస్తామ‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు.

రూఫ్ టాప్ సోలార్ కు ప్రోత్సాహం

విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలోని ఆకనంబట్టు గ్రామంలో రాష్ట్ర ఇంధన శాఖామాత్యులు గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ప్రారంభించిన కార్యక్రమంలో సీఎండి మాట్లాడుతూ ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసమే ‘డయల్ యువర్ సిఎండి’, ‘కరెంటోళ్ళ జనబాట’ ‘పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక’ లాంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. వినియోగదారులు తమ ప్రాంతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు, కంచెలేని ట్రాన్స్ఫార్మర్లు తదితర సమస్యలను తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా అవసరమైన ప్రాంతాల్లో ఆర్డిఎస్ఎస్ పథకం కింద అభివృద్ధి పనులను చేపడుతున్నామని వివరించారు. ఫీడర్ సోలరైజేషన్ ద్వారా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, రైతులకు మరింత మెరుగ్గా పగటిపూట 9 గంటల విద్యుత్తును సరఫరా చేస్తామని తెలిపారు.

అంతకుముందు ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో రాష్ట్ర ఇంధన శాఖా మాత్యులు గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా జరిగిన కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సిఎండి మాట్లాడుతూ ఉద్యోగుల సమిష్టి కృషి కారణంగానే వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించగలుగుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో కారుణ్య నియామకాల కింద 169 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు. ఉద్యోగులు మరింత బాధ్యతగా విధులు నిర్వహిస్తూ సంస్థను మరింత అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు కే. గురవయ్య, పి. అయూబ్ ఖాన్, కె. రామ మోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె రమణాదేవి, ఎన్. శోభా వాలెంటీనా, కె. ఆదిశేషయ్య, ఎస్. రమణ, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కే. జనార్దన్ నాయుడు, జాయింట్ సెక్రటరీ ఎం. గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కార్య‌క్ర‌మంలో తిరుప‌తి ఎమ్మెల్యే అర‌ణి శ్రీనివాసులు, పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యే ముర‌ళీమోహ‌న్, ఎంపీ ద‌గ్గుమ‌ళ్ల‌ ప్రసాద్ తో పాటు అధికారులు, కూట‌మి నేత‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *