-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు
-గురువారం నాడు కాకినాడ రూరల్ లోఉన్న తన స్వంత ఇంట్లో ఆర్దీఓ మల్లిబాబు జనగణన టీమ్ సమక్షంలో సెల్ఫ్ ఎన్యుమెరేషన్ ప్రక్రియను విజయంతంగా పూర్తి చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ “విద్యార్థుల నైతిక విలువల ” సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు దంపతులు
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచనకర్త మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ “ విద్యార్థుల నైతిక విలువల” సలహాదారు పద్మశ్రీ మరియు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు వారి ధర్మపత్ని తో కలిసి గురువారం నాడు కాకినాడ రూరల్ లోని తమ స్వగృహంలో భారత జనగణన సెన్సస్ కార్యక్రమం లో భాగంగా మొబైల్ ఫోన్ ద్వారా కాకినాడ ఆర్డీవో మల్లిబాబు జనగణన టీమ్ సమక్షంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ను విజయంతంగా పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
భారత జనగణన- 2027 లో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుండి 30 వరకు నుండి అమలు అవుతున్న ఈ జనగణన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో, పౌరులు స్వయంగా తమ కుటుంబానికి సంబంధించిన హౌస్ లిస్టింగ్ వివరాలను తమ మొబైల్ ఫోన్ల సహాయంతో https://se.census.gov.in/ ద్వారా లాగిన్ అయి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా డిజిటల్ పద్ధతిలో వారి వారి గృహ వివరాలను సొంతంగా , సులభంగా నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు దంపతులు ముందడుగు వేసి ఈ ప్రక్రియలో పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. భారత జనగణన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రారంభం అయిన మరుసటి రోజునే ఈ నెల 17 న జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ లు, డీఆర్ఓ తిప్పేనాయక్, పలువురు జిల్లా అధికారులు జనగణన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా తమ వివరాల నమోదును పూర్తి చేసి ప్రజల్లో జనగణనపై నమ్మకం కలిగించారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు దంపతులు గురువారం నాడు చేసిన జనగణన సెల్ఫ్ ఎన్యుమరేషన్ చర్య ప్రజల్లో జనగణన సెల్ఫ్ ఎన్యుమరేషన్ పై మరింత అవగాహన పెంపొందించడంతో పాటు, జనగణన కార్యక్రమంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా ఉందని స్థానికులు, అధికారులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు మాట్లాడుతూ జనగణన అనేది దేశ, రాష్ట్ర భవిష్యత్ నిర్మాణానికి పునాది వంటిదని, ఖచ్చితమైన జనగణన గణాంకాల ఆధారంగా ప్రభుత్వాలు భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తాయని, అందువల్ల ప్రజలందరూ ఉత్సాహంగా, బాధ్యతతో వ్యవహరిస్తూ జనగణనలో తప్పనిసరిగా పాల్గొనాలని, ప్రభుత్వం అందిస్తున్న సెల్ఫ్ ఎన్యుమరేషన్ సౌకర్యాన్ని వినియోగించుకుని సులభంగా ఈ ప్రక్రియను తమ సెల్ ఫోన్ల ద్వారా పూర్తి చేయవచ్చు అని , నేను కూడా ఈ రోజు (గురువారం) కాకినాడ రూరల్ లో ఉన్న తన ఇంటి నుండే సెల్ ఫోన్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేశానని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు తెలిపారు.
అలాగే, ఆయన ప్రజలకు పిలుపునిస్తూ, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తమ గృహ, కుటుంబ వివరాలను నమోదు చేసే సమయంలో ఖచ్చితమైన మరియు సమగ్ర సమాచారాన్ని అందించాలని సూచించారు. సరైన డేటా దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వనరుల సమర్థ వినియోగానికి కీలకమని ఆయన వివరించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల భవిష్యత్ ప్రణాళికల రూపకల్పన కోసం, దేశ నిర్మాణానికి పునాది లాంటి జనగణన లో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొని, ప్రభుత్వం అందిస్తున్న సెన్సస్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా వారి వారి మొబైల్ ఫోన్ల తో దాపరికం లేని ఖచ్చితమైన సమాచారాన్ని అందించి సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాలని , తద్వారా దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడాలని, జన గణన సెల్ఫ్ ఎన్యుమరేషన్ గడువు లోపు తమ వివరాలను నమోదు చేసి, జనగణన కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా, కాకినాడ ఆర్డిఓ మల్లిబాబు, సమాచార శాఖ ఉప సంచాలకులు తిమ్మప్ప, సమాచార అసిస్టెంట్ ఇంజనీర్ బాబు రావు, ఆర్డీవో కార్యాలయం సిబ్బంది సుబ్బా రావు, కాకినాడ రూరల్ మండలం డిప్యూటీ తహశీల్దార్ సురేష్ , ఆర్ ఐ భవాని, ఏ ఎస్ ఓ శ్రీకాంత్ తదితరులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు దంపతులకు మర్యాదపూర్వకంగా పళ్ల బుట్టను అందించి, మెమెంటో తో సత్కరించారు.
Prajavartha Online Telugu News