-హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులైన జస్టిస్ లిసా గిల్ ప్రసంశ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
న్యాయ సేవలో చిరస్మరణీయ సేవాస్ఫూర్తికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదర్శంగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై శనివారం బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా గిల్ ప్రసంశించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ సందర్బంగా శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ ప్రతిభావంతమైన న్యాయవేత్తగా, దూరదృష్టి కలిగిన పరిపాలకుడిగా,వినయం మరియు మానవీయ విలువల ప్రతిరూపంగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నిలిచారని కొనియాడారు.వారి సేవలు ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయని ప్రశంసించారు.
1964 ఏప్రిల్ 25న జన్మించిన జస్టిస్ ఠాకూర్ 1989లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.న్యాయరంగంలో విశేష ప్రతిభ కనబరిచి 2011లో సీనియర్ అడ్వకేట్ హోదాపొందారన్నారు.అనంతరం 2013లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారన్నారు.2022లో బొంబాయి హైకోర్టుకు బదిలీ అయ్యి అక్కడ కూడా విశిష్ట సేవలు అందించారన్నారు.తదుపరి 2023 జూలై 28న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి న్యాయ వ్యవస్థ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు.వారి పదవీకాలంలో న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం లభించిందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 38 కోర్టు భవనాల ప్రారంభోత్సవాలు జరిగాయని, 47 కొత్త న్యాయస్థాన భవనాలకు శంకుస్థాపనలు చేపట్టబడ్డాయన్నారు.జడ్జిల నివాస సముదాయాలు, జ్యుడీషియల్ అకాడమీ,అమరావతి మరియు విశాఖపట్నంలో అతిథి గృహాలు వంటి పలు ముఖ్య నిర్మాణాలు ఆయన చొరవతో ప్రారంభమయ్యాయన్నారు.కోర్టు హాళ్లలో ఎయిర్ కండిషనింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా న్యాయసేవల నిర్వహణకు మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించారని జస్టిస్ లిసా గిల్ అన్నారు.నియామకాలు మరియు పరిపాలనా సంస్కరణల విషయంలో కూడా వీరి పదవీకాలం విశేషంగా నిలిచిందన్నారు.13 మంది జిల్లా న్యాయమూర్తులు,73 మంది సివిల్ జడ్జీలు,3,432 మంది జిల్లా న్యాయవ్యవస్థ సిబ్బంది నియమించబడ్డారన్నారు.హైకోర్టులో 245 కొత్త పోస్టులు మంజూరు చేయబడగా,అర్హులైన వారికి పదోన్నతులు కల్పించబడ్డాయన్నారు.64 మంది లా క్లర్కులు నియమించబడి,అదనంగా 332 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించబడిందన్నారు.
సాంకేతికత ఆధునికీకరణలో జస్టిస్ ఠాకూర్ ప్రత్యేక దృష్టి నిలిపారని జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు.పేపర్‌లెస్ కోర్టులు,జడ్జెస్ డ్యాష్‌బోర్డ్,డిజిటల్ కాజ్ లిస్ట్ వ్యవస్థ,ఈ-షెడ్యూలింగ్, ఆన్లైన్ ఆర్టీఐ పోర్టల్, వర్చువల్ జస్టిస్ క్లాక్, ఆధునిక మొబైల్ యాప్, సౌకర్యవంతమైన అధికారిక వెబ్సైట్ వంటి అనేక సంస్కరణలు అమలు చేశారన్నారు.సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పులను అనువాద రూపంలో ప్రజలకు అందుబాటులోకి తేవడం ద్వారా న్యాయ అవగాహన పెంపుకు కృషి చేశారన్నారు.జస్టిస్ ఠాకూర్ పదవీ విరమణ చేయడం హైకోర్టుకు తీరని లోటని కాని ఆయన ఏర్పాటు చేసిన పరిపాలనా ప్రమాణాలు, చేపట్టిన సంస్కరణలు, చూపిన నాయకత్వం చిరకాలం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ఆయన సమాజానికి, దేశానికి మరిన్ని ఉన్నత సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ ఆరోగ్యం,ఆనందం, విజయాలతో నిండిన జీవితాన్ని కోరుతూ జస్టిస్ లిసా గిల్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
న్యాయ స్వాతంత్ర్యం ప్రజల హక్కు…. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
న్యాయ స్వాతంత్ర్యం ప్రజల హక్కు అని ఆ హక్కును పరిరక్షించే బాధ్యత న్యాయాన్ని నిష్పాక్షికంగా అందజేసే బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల నుండి పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు.తన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడుతూ న్యాయమూర్తి బాధ్యతలు అత్యంత క్లిష్టమైనవని, వినడంలో ఓర్పు, వ్యవహారంలో నిష్పాక్షికత, నిర్ణయాలలో ధైర్యం, ప్రవర్తనలో మర్యాద అవసరమని తెలిపారు.ప్రతి తీర్పు ప్రజల జీవితాలు స్వేచ్ఛలు భవిష్యత్తులను ప్రభావితం చేస్తుందనే అవగాహనతో పనిచేయడం న్యాయమూర్తి కర్తవ్యమన్నారు. పెరుగుతున్న కేసుల సంఖ్య న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అయితే అదే సమయంలో కోర్టులపై భారాన్ని పెంచుతోందని పేర్కొన్నారు.న్యాయం ఆలస్యం కాకుండా చూడటంలో న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులకూ సమాన బాధ్యత ఉందని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
హైకోర్టు భవిష్యత్తు కోసం మౌలిక వసతులు అత్యంత ముఖ్యమని అందుకు ప్రతిపాదిత “జస్టిస్ సిటీ” ఎంతో అవసరమనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.కొత్త హైకోర్టు భవనం, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం, జ్యుడీషియల్ అకాడమీ, న్యాయవాదుల చాంబర్లు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు వంటి సమగ్ర సదుపాయాలతో ఈ ప్రణాళిక న్యాయరంగానికి గొప్ప ముందడుగని అభిప్రాయపడ్డారు.ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అభినందించారు.వ్యక్తిగత విజయాలు అన్నీ వ్యక్తిగత కృషి ఫలితమే కాకుండా, సంస్థాగత సహకారం, సహచరుల మద్దతు, న్యాయవ్యవస్థ కల్పించిన అవకాశాల సమ్మిళిత ఫలితమని వినయపూర్వకంగా ఆయన పేర్కొన్నారు.న్యాయాన్ని వృత్తిగా మాత్రమే కాకుండా జీవన విధానంగా భావించే కుటుంబంలో జన్మించడం తన అదృష్టమని చెప్పారు.తన తండ్రి స్వర్గీయ డి.డి. ఠాకూర్ వారి నుంచి నిజాయితీ విలువను,తన అన్నయ్య మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ వారి నుంచి క్రమశిక్షణ, సిద్ధత, బాధ్యత వంటి గుణాలను నేర్చుకున్నానని తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ హైకోర్టు, బొంబాయి హైకోర్టు, అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సేవలందించే అవకాశం తనకు లభించడం గౌరవంగా భావిస్తున్నానని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు.ప్రతి హైకోర్టుకు ప్రత్యేక సంప్రదాయాలు ఉన్నప్పటికీ, ప్రజలు న్యాయం కోసం చూపే విశ్వాసమే ప్రతి న్యాయస్థానానికి మూలాధారం అని అన్నారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గొప్ప వారసత్వం కలిగిన సంస్థగా నిలిచిందని, ఇక్కడి బార్ సభ్యులు చూపిన ఆత్మీయత, సహకారం, మర్యాద తన బాధ్యతల నిర్వహణను సులభతరం చేశాయని కొనియాడారు.బార్ అనేది బెంచ్‌కు తల్లి మాత్రమే కాదు, న్యాయమూర్తులను అంచనా వేసే శక్తి కూడా అని వ్యాఖ్యానించారు.తన పదవీకాలంలో సహకరించిన న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది అందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.బార్ సభ్యులు మరియు న్యాయ కుటుంబానికి విజయవంతమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తూ, న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం ప్రతి పౌరుడి హక్కు అని స్పష్టం చేశారు.నిష్పాక్షికతను నిలబెట్టి, సంస్థాగత విలువలను బలోపేతం చేసి, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించగలిగితే తన సేవా కాలం సార్థకమైందిగా భావిస్తానని పేర్కొన్నారు.
అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ,అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్,ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వొకేట్స్ అసోషియేషన్ అద్యక్షులు ప్రభునాథ్ మరియు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ ద్వారకానాథ్ మాట్లాడుతూ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా న్యాయ వ్యవస్థకు ఉత్తమమైన సేవలు అందించారని కొనియాడారు.వీరి వ్యక్తిత్వంలో వినయం,సమతుల్యత,మర్యాద, దృఢ నిర్ణయశక్తి ప్రత్యేకంగా ప్రతిఫలించాయని పేర్కొన్నారు.మృదుస్వభావంతో వ్యవహరించినప్పటికీ పరిపాలనలో ఆయన చూపిన క్రమశిక్షణ, న్యాయపాలనలో చూపిన నిష్పాక్షికత అందరికీ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈవీడ్కోలు కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయ మూర్తులు, అదనపు అడ్వకేట్ జనరల్ ఇ.సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ పార్థసారధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు మరియు కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, రిజిస్ట్రీ అధికారులు మరియు హైకోర్టు ఉద్యోగులు, ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ, ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News