-రాష్ట్రంలో సింగపూర్ విధానాలు అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్న మంత్రులు
-సింగపూర్‌లో ఏపీ మంత్రుల 4వ రోజు పర్యటన విజయవంతం
సింగపూర్, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సింగపూర్‌లో కొనసాగుతున్న అధ్యయన పర్యటనలో భాగంగా నాలుగో రోజు కార్యక్రమాలు “ప్రజా బాధ్యత, స్థిరమైన ప్రజా నమ్మకం, జల వనరుల నిర్వహణ” అనే అంశాలపై విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఉదయం సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్‌ప్రైజ్ (SCE) లో నిర్వహించిన సమావేశంలో గత రోజు అంశాలపై సమీక్ష నిర్వహించగా, డాక్టర్ ప్రేమ్ కుమార్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. అనంతరం “నేషన్ ఫస్ట్” నుంచి “వియ్ ఫస్ట్” దిశగా మార్పు, ప్రజలు–ప్రభుత్వం–ప్రైవేట్ రంగాల సమన్వయం, పనితీరు ఆధారంగా నమ్మకం నిర్మాణం, సమర్థమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సెషన్‌లో మాజీ మంత్రి లిమ్ స్వీ సే ప్రసంగిస్తూ, సమర్థవంతమైన పాలన ద్వారా దీర్ఘకాలిక ప్రజా నమ్మకాన్ని ఎలా నిర్మించాలో వివరించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమన్వయం, బాధ్యతాయుత వైఖరి, పారదర్శకత వంటి అంశాల ప్రాముఖ్యతను ఆయన వెల్లడించారు. మధ్యాహ్నం “Singapore’s Water Story” పై నిర్వహించిన సెషన్‌లో సింగపూర్ జల వనరుల నిర్వహణ, నీటి సంరక్షణ, ఆధునిక సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందానికి నిపుణులు వివరించారు. అనంతరం NUS Cities కు చెందిన డాక్టర్ ఎం. ఖూ టెంగ్ చై మార్గదర్శకత్వంలో మారినా బ్యారేజ్ ను సందర్శించారు. మారినా బ్యారేజ్ వద్ద నీటి నిల్వ, వరద నియంత్రణ, శుద్ధి విధానాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలను మంత్రులు ప్రత్యక్షంగా పరిశీలించారు. సమగ్ర జల వనరుల నిర్వహణలో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలు మంత్రులకు ప్రేరణనిచ్చాయి.
ఈ అధ్యయన పర్యటన ద్వారా ప్రజా నమ్మకం పెంపు, బాధ్యతాయుత పాలన, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలలో సింగపూర్ అనుభవాలను అవగాహన చేసుకుని, వాటిని మన రాష్ట్రంలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం తెలిపింది. మంత్రుల బృందంలో పి. నారాయణ, వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, బి.సి జనార్దన్ రెడ్డి, APSDPS ED ఆలపర్తి వెంకటేశ్వరరావు ఉన్నారు.
Prajavartha Online Telugu News