Breaking News

డీజిల్, పెట్రోల్‌పై ఆ పార్టీ పుకార్లతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది

-ఆ పార్టీ నాయకులు నెగటివ్ ప్రచారంతో ప్రభుత్వంపై అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపణ
-ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి సంస్థలు పెట్టుబడులు, గూగుల్ త్వరలో ప్రారంభం
-రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయని స్పష్టం
-డీజిల్ కొరత వార్తలు పుకార్లేనని, తాత్కాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు
-ఆయిల్ కంపెనీలతో సమన్వయం ద్వారా సరఫరా మెరుగుదలకు కృషి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి విమర్శించారు.

కృష్ణా జిల్లా పామర్రు మండలం కారకంపాడు గ్రామంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి కొలుసు పార్ధ సారథి మాట్లాడుతూ, ఆ పార్టీ నాయకులు నెగటివ్ ప్రచారం ద్వారా ప్రభుత్వంపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం లో పెట్టుబడుల వెల్లువలా వచ్చి పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. గూగుల్ సంస్థ కూడా త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశారు.

డీజిల్ కొరతపై వస్తున్న వార్తలు పుకార్లేనని పేర్కొంటూ, కొన్ని జిల్లాల్లో తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటోందన్నారు. పానిక్ పర్చేస్‌ల వల్ల కొంత ఒత్తిడి ఏర్పడిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేస్తూ సరఫరా మెరుగుపరుస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ డీజిల్, పెట్రోల్ పై పరిస్థితిని సమీక్షిస్తున్నారని, రైతులు, ఆక్వా రంగానికి ఎటువంటి డీజిల్ కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. స్టాక్ అవుట్ పెట్రోల్ బంకుల సంఖ్య తగ్గుతూ, పరిస్థితి త్వరలో సాధారణమవుతుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ధాన్యం చెల్లింపులు 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వెల్లడించారు.

మొక్కజొన్న రైతుల సమస్యను కేంద్రానికి తెలియజేసినట్టు, స్పందన వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ.800 కోట్లు ఖర్చు చేసి రైతులకు అండగా నిలిచినట్లు తెలిపారు. పొగాకు, కోకో, మామిడి వంటి పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మద్దతు ధర అందిస్తున్నామని వివరించారు.

నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధి
డ్రైనేజీ, ఇరిగేషన్ వ్యవస్థలను మెరుగుపరచడానికి O&M నిధులు కేటాయించి టెండర్ల ద్వారా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

పెట్రోల్ బంకుల్లో కొరత ఉందన్న వార్తలను ఖండిస్తూ, ఎక్కడా నిల్వల కొరత లేదని స్పష్టం చేశారు. ధరలు అంతర్జాతీయ మార్కెట్ మరియు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటాయని తెలిపారు.

విలేకరి ఘటనపై ఖండన

చిత్తూరు జిల్లా వి.కోటలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, వారిపై దాడులు చేయడం అనాగరికమని పేర్కొంటూ బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి:

పెట్రోల్, డీజిల్ విషయాల్లో పుకార్లను నమ్మకుండా, పానిక్ పర్చేస్‌లు చేయవద్దని మంత్రి కొలుసు పార్థ సారథి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ సరఫరాను నిరంతరం కొనసాగించే చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *