విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రిజర్వు బ్యాంకుకు దేశవ్యాప్తంగా 33 కార్యాలయాలు, అనేక శిక్షణ కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్ర బ్యాంకులో ఆఫీసు అసిస్టెంట్, ఇతర ఉద్యోగఖాళీల భర్తీకి వెలువడే నోటిఫికేషన్లు ఆర్బీఐ వెబ్ సైట్ లో చూడాలని ఆర్బీఐ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఏజీఎం రూప ఆర్.సి.అన్నారు. బుధవారం ఉదయం విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎంబీఏ విభాగం సెమినార్ హాలులో బ్యాంకింగ్ రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూప మాట్లాడుతూ తాను యూపీఎస్సీకి శిక్షణ తీసుకుంటున్న తరుణంలో పదేళ్లక్రితం ఆర్బీఐ ఉద్యోగానికి ఎంపిక అయ్యానన్నారు. ప్రస్తుతం ఆర్బీఐ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అందుబాటులో ఉందని, ఇటీవల విజయవాడలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభమైనందున పీజీ విద్యార్థులు ఇంటర్న్ షిప్ కి ఆర్బీఐని ఎంపిక చేసుకోవచ్చని, జిందాల్ వెబ్ సైట్ తదితర వనరుల నుంచి బ్యాంకింగ్ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులు వర్తమాన అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకోవాలన్నారు. జనరల్ ఇంగ్లిష్ పై పట్టు సాధించాలన్నారు. ప్రజల విశ్వాసం పెంచడానికి బ్యాంకుల అజమాయిషీ అవసరమని, ఆ దిశగా 1935లో ఏర్పాటైన ఆర్.బి.ఐ.దేశంలో ఆర్థిక స్థిరత్వానికి చర్యలు తీసుకుంటోందన్నారు. కరెన్సీ స్థిరత్వం, వినియోగదారుల ఆర్థికరక్షణ ఆర్బీఐ లక్ష్యమని చెప్పారు. గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రోత్సహించడం, ప్రభుత్వానికి ఆర్థిక సలహాలు ఇవ్వడం ఆర్బీఐ విధుల్లో భాగమన్నారు. కళాశాల డీన్ ఆచార్య రాజేష్ సి. జంపాల మాట్లాడుతూ అమరావతిలో పెద్ద ఎత్తున బ్యాంకింగ్ వ్యవస్థ తరలి వస్తున్నందున ఉపాధికి కొదువ లేదని, మహిళలు దూరతీరాలకు వెళ్ళనవసరం లేదన్నారు. ఈ సందర్భంగా డీన్ ఆచార్య రాజేష్ సి.జంపాల, పీవీపీ ఇంజనీరింగ్ కాలేజీ ఎం.బి.ఎ. విభాగాధిపతి డా.పి. ఆదిలక్ష్మి, పీబీ సిద్ధార్థ ఆచార్యులు డా. బాబూ రాజేంద్రప్రసాద్, ఎండి రెహ్మాన్ తదితరులు రూపను సత్కరించారు.
Prajavartha Online Telugu News