Breaking News

పశుసంవర్ధక రంగానికి నూతన దిశా నిర్దేశం

– “పశుసంవర్ధక మార్గదర్శిని” ఈ – మేగజైన్‌తో రైతులకు శాస్త్రీయ మార్గనిర్దేశం
– పాడి పశువుల నుంచి కోట్ల ఆర్థిక వృద్ధి
– రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చ‌ర్య‌లు
– ప్రతి ఇంటికో ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంగా ప్ర‌భుత్వం అడుగులు – మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పశుసంవర్ధక రంగ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో “పశుసంవర్ధక మార్గదర్శిని” ఈ-మేగజైన్‌ను రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, పాడిప‌రిశ్ర‌మాభివృద్ధి శాఖ‌ల‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు పాడి పశువులు, సన్న జీవాలు, నాటు కోళ్ల పెంపకంతో అనుబంధం కలిగి ఉన్నారని తెలిపారు. 2025–26 సంవత్సరానికి పశుసంవర్ధక శాఖ ద్వారా రూ.1,76,151 కోట్ల స్థూల విలువ వృద్ధి నమోదవడం ఈ రంగ ప్రాధాన్యతను స్పష్టంగా చూపుతోందన్నారు. అయినప్పటికీ సంప్రదాయ యాజమాన్య పద్ధతులు, కూలీల కొరత, పశుగ్రాసాల లోపం, పెరుగుతున్న దాణా ఖర్చులు వంటి సమస్యల కారణంగా ఆశించిన స్థాయి వృద్ధి సాధ్యంకావడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత శాస్త్ర సాంకేతిక రంగాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, అదే సమయంలో పశుసంవర్ధక రంగాన్ని వాణిజ్య సరళిలో అభివృద్ధి చేసుకునే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. పాడి పశువులు, జీవాలు, నాటు కోళ్లు, పందుల పెంపకం వంటి రంగాల్లో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విశాఖపట్నంలోని రాష్ట్ర పశుగణ యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల వ్యవస్థాపక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1500 మంది శిక్షణ పొందగా, అందులో సుమారు 200 మంది రైతులు వాణిజ్యపరంగా లాభసాటిగా పశుసంవర్ధక కార్యకలాపాలను విజయవంతంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన “పశుసంవర్ధక మార్గదర్శిని” ఈ-మేగజైన్‌ను ఏప్రిల్ నెల నుండి [www.apahsmile.in (http://www.apahsmile.in) “స్మైల్” వెబ్‌సైట్‌తో పాటు రిలయన్స్ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ మేగజైన్‌లో పశు ఆరోగ్యం, పునరుత్పత్తి, పోషణ, యాజమాన్యం, మార్కెటింగ్, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై సమగ్ర సమాచారం, విజయగాథలు, నిపుణుల సూచనలు, రైతుల సందేహాలకు సమాధానాలు అందించబడతాయని చెప్పారు. అలాగే, గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న పశుసంవర్ధక సహాయకులు, గోపాల మిత్రులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరవేయడంలో కూడా ఈ-మేగజైన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

పశుసంవర్ధక రంగాన్ని సేంద్రియ, వాణిజ్య పద్ధతుల్లో అభివృద్ధి చేస్తే ఒక్క ఎకరం నుంచి సంవత్సరానికి రూ.5-6 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశముందని మంత్రి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఆకాంక్షించినట్లుగా ప్రతి ఇంటిలో ఒక ఎంట్రప్రెన్యూర్ ఏర్పడి, వ్యక్తిగత అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశాఖ‌ప‌ట్నం పశుసంవర్ధక శాఖ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ డా.వై. సింహాచ‌లం, జాయింట్ డైరెక్ట‌ర్ డా. బైరాగి, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *