-మీడియా సమన్వయంలో ప్రసాద్ ది తనదైన ముద్ర..
-ప్రసాద్ సేవలు మరి కొంత కాలం అవసరం..
-జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యంత కీలకమైన సమాచార పౌర సంబంధాల శాఖలో వి.వి.ప్రసాద్ సమర్థవంతమైన సేవలతో వృత్తికి వన్నె తెచ్చారని ఆయన సేవలు మరి కొంత కాలం అవసరమని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ అన్నారు. సమాచార పౌరసంబధాల శాఖ జిల్లా పౌర సంబంధాల కార్యాలయంలో ఎ.వి.సూపర్ వైజర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన వి.వి. ప్రసాద్ మీడియా ప్రతినిధుల ఆత్మియ కలయిక కార్యక్రమం శుక్రవారం నగరంలోని హనుమాన్ పేట నందు గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.
సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ మీడియాను సమన్వయం చేయటం కీలకమైన అంశం అన్నారు. వి.వి. ప్రసాద్ ప్రభుత్వ కార్యక్రమాలలో ఎటువంటి సమస్యలు రాకుండా మీడియాను చాలా అద్భుతంగా సమన్వయం చేశారని అభినందించారు. తన 13 ఏళ్ల సర్వీసులో వి.వి.ప్రసాద్ వంటి ఉత్తమ కోఆర్డినేటర్‌ను ఎక్కడా చూడలేదని, తన టీం ఎన్‌టిఆర్‌లో ఒక ప్రధానమైన ఎసెట్ అని అన్నారు. సమర్థవంతమైన సేవలందిస్తున్న ప్రసాద్ పదవీ విరమణ పొందడం తనకు ఇష్టం లేదని, ఆయన సేవలు జిల్లాకు ఇంకా అవసరమన్నారు. అందుకే ఆయనను తిరిగి నియమించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వి.వి.ప్రసాద్ చాలా మంచి మనిషి అన్ని తనకు కుటుంబ సభ్యుడులాంటి వాడని అన్నారు. ఆయన తిరిగి పునర్:నియామకం జరిగేలా అవసరమైన చర్యలు సమాచార శాఖ అధికారులు తీసుకోవాలని కోరారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని అనంతరం కుటుంబ సభ్యులతో అనందమైన జీవితం, ఆరోగ్యం సంతోషంగా ఉండాలని కలెక్టర్ డా.జి. లక్ష్మీశ ఆకాంక్షించారు.
సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ పి. కిరణ్‌కుమార్ మాట్లాడుతూ సమాచార శాఖలో సమర్థవంతమైన సేవలందిస్తున్న వారిలో వి.వి. ప్రసాద్ ఒకరని అన్నారు. ఉద్యోగ ప్రస్థానం సినీ అపరేటర్‌గా ప్రారంభమైనప్పటికి ఫోటోగ్రాఫర్‌గా పిఆర్వోగా మీడియా సమన్యకర్తగా అసమానమైన సేవలందించి మంచి గుర్తింపు పొందన్నారు. జాయింట్ డైరెక్టర్ ఐ. సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఉద్యోగ పరంగా సేవలందించడంతో పాటు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన సేవలు అందించడంతో వి.వి. ప్రసాద్ తనదైన ముద్ర వేసుకున్నారని ఆయనకు అప్పగించిన ఎటువంటి క్లిష్టతరమైన పనినైన అత్యంత చాకచక్యంతో సులువుగా పూర్తి చేసి అధికారులతో శభాష్ అనిపించుకునేవారు. జాయింట్ డైరెక్టర్ టి. కసూరి మాట్లాడుతూ సమాచార శాఖ ఉద్యోగులలో వి.వి. ప్రసాద్‌కు మంచి గుర్తింపు ఉందని ఆయనపనితీరు ఆదర్శవంతంగా తీసుకోవాలని ముఖ్యంగా మీడియా ప్రతినిధులతో ఉద్యోగిగా కాకుండా కుటుంబ సభ్యునివలే ఆదరాభిమానాలు పొందరన్నారు.
పదవీ విరమణ పొందిన వి.వి.ప్రసాద్ మాట్లాడుతూ 29 ఏళ్ళుగా విజయవాడలో సమాచార శాఖ ద్వారా మీడియా మిత్రులకు సేవలందించే భాగ్యం కల్పించినందుకు ఆయన భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. 1997లో అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీమతి చిత్ర రామచంద్రన్ కాలం నుండి ప్రస్తుత జిల్లా డా.జి. కలెక్టర్ లక్ష్మీశ వరకు అందరు కలెక్టర్ల వద్ద పని చేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తన పనితీరును మెచ్చి, తనను తిరిగి నియామకం చేసేలా ప్రభుత్వానికి రాసిన సిఫార్సు లేఖను తన జీవితంలో అతిపెద్ద అవార్డుగా భావిస్తున్నానని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తన పదవీ కాలంలో మీడియా మిత్రులు తనను ఒక కుటుంబ సభ్యునిలా, “ప్రసాద్ అన్న” అని పిలుస్తూ ఆదరించారని తాను పదవిలో ఉన్నా లేకపోయినా, ప్రాణం ఉన్నంత వరకు సమాచార శాఖకు, మీడియా మిత్రులకు తన వంతు సేవలు అందిస్తూనే ఉంటానని వి. వి ప్రసాద్ అన్నారు.
కార్యక్రమంలో సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు ఎస్.వి. మోహనరావు, పి. రాజశేఖర్, కె. నారాయణరెడ్డి, ఎఎస్ వీరభద్రరావు, డిఐపిఆర్వో కె.వి. రమణరావు, పిఆర్వో జి. రాంబాబు, పింట్, ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News