చిల్లకల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
చిల్లకల్లు ఆటో వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మరియు భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల ఆధ్వర్యంలో ఆటో స్టాండ్ సెంటర్ వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం గారు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) గారు, ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం.సి.హెచ్ శ్రీనివాసరావు గారు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ కమ్యూనిస్టు నాయకుడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శ్రీ నెట్టెం రఘురాం గారు మాట్లాడుతూ, అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల హక్కుల కోసం సాగిన పోరాటాలకు మే డే ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. శ్రమజీవుల సంఘటిత శక్తి సమాజ అభివృద్ధికి కీలకమని, దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికులే బలమైన పునాది అని అన్నారు.
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. 18.25 లక్షల మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులను నమోదు చేసి, వారికి నాలుగు ప్రధాన సంక్షేమ పథకాలను పునరుద్ధరించిందని తెలిపారు. వివాహ కానుకగా ₹20,000, ప్రసూతి సహాయంగా ₹20,000, సహజ మరణ సహాయంగా ₹60,000, అంత్యక్రియల ఖర్చులకు ₹20,000 అందజేస్తున్నట్లు వివరించారు. అదనంగా నిర్మాణ రంగ కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అసంఘటిత రంగానికి చెందిన 88.53 లక్షల మంది కార్మికులను నమోదు చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం ₹5కే నాణ్యమైన భోజనం అందిస్తూ, ప్రతి కార్మికుడు గౌరవంగా జీవించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “స్వర్ణాంధ్ర 2047” లక్ష్య సాధనలో శ్రామికులే ప్రధాన శక్తి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రావూరు విశ్వనాథం, కట్టా వెంకట నరసింహారావు, మండల సమైక్య అధ్యక్షురాలు శ్రీమతి నాయిని రజిని, ముత్తినేని అశోక్, రావూరి శ్రీనివాసరావు, తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఆలూరి రమణ, ఎల్‌ఎస్‌సిఎస్ అధ్యక్షులు ధూళిపాళ్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ అధ్యక్షులు బత్తుల బ్రహ్మం అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు షేక్ అల్లావుద్దీన్, కార్యదర్శి ఎస్కె రజావాలి, కోశాధికారి అబ్బురం మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Prajavartha Online Telugu News