– 98.69 శాతం హాజరు నమోదు
– పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా నిర్వహించిన జాతీయస్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ (యూజీ)-2026 ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 32 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా మొత్తం 11,496 మంది అభ్యర్థులకుగాను 11,345 మంది (98.69 శాతం) హాజరైనట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ పరీక్ష ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడంతోపాటు కొండపల్లిలోని జెడ్పీ బాలికల పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్ష ముగిసిన అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు పరీక్ష జరిగిందని.. అభ్యర్థుల ధ్రువీకరణ, బయోమెట్రిక్ హాజరు, భద్రత.. ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని, ఏర్పాట్ల విషయంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూశామన్నారు. వేసవి నేపథ్యంలో ప్రతి పరీక్ష కేంద్రం వద్ద తాగునీటితో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష విజయవంతానికి కృషిచేసిన నీట్ కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లు, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో పాటు రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్, ప్రజా రవాణా తదితర సమన్వయ శాఖల అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News