-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
సోమందేపల్లి/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేతలకు ఏడాది పాటు అధిక ఆదాయంతో కూడిన ఉపాధి కల్పనతో ఆరోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఉచిత విద్యుత్ పథకంతో నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు కలిగిందన్నారు. రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులను పెంచడంతో పాటు నేతన్నలకు ఏడాది పాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా టెక్స్ టైల్స్ పార్కులు, మెగా, మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన చేనేతలకు ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవకాశమిస్తున్నామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కొత్తపల్లిలో పలువురు చేనేత కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి మంత్రి సవిత ఆదివారం పలుకరించారు. చేనేతలకు మంత్రి సవిత స్వయంగా కరెంట్ బిల్లు అందజేశారు. ఉచిత విద్యుత్ పథకం అమలు వల్ల కలిగిన లాభాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు ఆయా చేనేత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా తమకు ఆర్థిక మేలు జరిగిందన్నారు. జీరో పేమెంట్ విద్యుత్ బిల్లులను మంత్రికి చూపించారు. ఇచ్చినమాటకు కట్టుబడుతూ, ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు, కూటమి ప్రభుత్వానికి చేనేతలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, నేతన్నలకు సీఎం చంద్రబాబునాయుడు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకం ద్వారా మగ్గం నేతన్నలకు నెలకు రూ.720లు, సంవత్సరానికి రూ.8,640లు, మరమగ్గం మీద నేసే కుటుంబానికి నెలకు రూ.1,800లు, ఏడాదికి రూ.21,600లు లబ్ధి కలుగుతోందన్నారు. రాష్ట్రంలో 55,405 మగ్గం నేతన్నల కుటుంబాలకు, 8,611 మరమగ్గం మీద నేసే కుటుంబాలను ఉచిత విద్యుత్ పథకం కింద అర్హులుగా గుర్తించామన్నారు. మిగిలిన అర్హులకూ ఉచిత విద్యుత్ పథకం వర్తించేలా కృషి చేస్తున్నామన్నారు.
చేనేత రంగ అభివృద్ధికి పెద్దపీట
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు ఒకవైపు చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతూనే, నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా పథకాలు అమలు చేస్తోందన్నారు. దీనిలో భాగంగా, గత నెల ఒకటో తేదీ నుంచి చేనేతలకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ అందజేస్తోందన్నారు. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు కేటాయిస్తోందన్నారు. ముద్ర రుణాలు అందజేస్తున్నామన్నారు. 15 శాతం సబ్సిడీ నూలును, 90 శాతం సబ్సిడీతో మగ్గం పనిముట్టు అందజేస్తున్నామని తెలిపారు. ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆన్ లైన్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేనేత ఉత్పత్తులను డోర్ డెలివరీ చేస్తున్నామన్నారు. నేతన్నలకు ఏడాదంతా ఉపాధి కల్పించడంతో పాటు అధిక ఆదాయంతో కూడిన ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇందుకోసం యూనివర్శల్ హెల్త్ పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. అనంతరం మంత్రి సవితను చేనేత కుటుంబాలు ఘనంగా సత్కరించాయి. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News