గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రతి గురువారం పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కార పురోగతిపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్విస్తామన్నారు. కేవలం కాగితాల మీద లేదా ఆన్లైన్ రికార్డుల్లో అర్జీలను పరిష్కరించినట్లు చూపడం సరికాదని, క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా పనులు జరగాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలన్నారు. అర్జీల్లో ఏదైనా సమస్య పరిష్కారానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే, ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి వివరించి, ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
పిజిఆర్ఎస్ ద్వారా 48 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 15, ఇంజినీరింగ్ విభాగం 18, రెవెన్యూ విభాగం 13, అకౌంట్స్ విభాగానికి సంబందించి 2 ఫిర్యాదు అందాయన్నారు.
కార్యక్రమంలో, అదనపు కమిషనర్ (ఇంచార్జి) జి.సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్, ఎస్ఈ వెంకటేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News