గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వర్షాలకు ముందే నిర్మాణంలోని మేజర్ డ్రైన్ల నిర్మాణం పూర్తి కావాలని, ప్రతి అభివృద్ధి పనిలో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే సంబందిత ఇంజినీరింగ్ అధికారులే భాధ్యత వహించాల్సి వస్తుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం నల్లపాడు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, జిటి రోడ్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించి, తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురవడానికి ముందే ముఖ్యంగా డ్రైన్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని, అందుకు రోజువారీ ప్రణాళిక సిద్దం చేసుకోవాలని ఏఈ, డిఈఈలను ఆదేశించారు. రానున్న వర్షాకాలం నగరంలో ఏ ప్రాంతం ముంపుకు గురి కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, పనుల్లో నాణ్యతను థర్డ్ పార్టీ క్వాలిటి కంట్రోల్ ఏజన్సీతో పాటు, ఇతర ఏజన్సీలతో కూడా తనిఖీ చేయిస్తామన్నారు. డ్రైన్ నిర్మాణ అనంతరం నిర్మాణ వ్యర్ధాలను కాంట్రాక్టరే తొలగించడంతో పాటు లెవలింగ్ చేసిన అనంతరమే బిల్లుల పేమెంట్ కి ప్రాసెస్ చేయాలని స్పష్టం చేశారు. పనులు జరిగే ప్రాంతాల్లో కాంట్రాక్టర్ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా ఎమినిటి కార్యదర్శులు అక్కడే ఉండాలన్నారు. డ్రైన్లలో పూడిక తీసిన 24 గంటల్లోగా అక్కడి నుండి తొలగించాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, రోడ్ల వెంబడి నిర్మాణ వ్యర్ధాలు ఉండడానికి వీలు లేదని, తొలగించిన తర్వాత ఎవరైనా వేస్తే అపరాధ రుసుం విధించాలని ఇన్స్పెక్టర్లను ఆదేశించారు.
పర్యటనలో ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈ విష్ణు, డిఈఈ శ్రీనివాస్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News