– అవసరంలో ఆదుకునే చేయి… రెడ్‌క్రాస్ సేవా స్పూర్తి
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ఆపద సమయంలో ముందుండి సేవలు అందిస్తూ మానవత్వానికి ప్రతీకగా నిలుస్తున్న సంస్థ రెడ్‌క్రాస్ అని, అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడటం, విపత్తుల సమయంలో సాయం అందించడం, రక్తదానం వంటి కార్యక్రమాల ద్వారా రెడ్‌క్రాస్ విశిష్ట సేవలు అందిస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కొనియాడారు.
ప్రపంచవ్యాప్తంగా మానవతా సేవలకు ప్రతీకగా నిలిచిన రెడ్‌క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాంట్ జయంతి సందర్భంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ వేడుకలు విజయవాడలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. సమాజంలో మానవత్వాన్ని నిలబెట్టే సంస్థగా రెడ్ క్రాస్ విశేష పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, వైద్య సేవలు, పేదలకు సహాయం వంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తోందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ డా. జి.సమరం మాట్లాడుతూ యువతలో రక్తదానంపై అవగాహన పెంచుతున్నట్లు తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఆరోగ్య శిబిరాలు, ప్రాథమిక చికిత్సకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వైస్ ఛైర్మన్ డా. వెలగా జోషి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలు కేవలం వైద్యరంగానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను పెంపొందించే దిశగా కొనసాగుతున్నాయని అన్నారు. కార్యదర్శి చిట్టిబాబు సంస్థ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ కనకారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, రెడ్ క్రాస్ వాలంటీర్లు, వైద్య సిబ్బంది పెద్దఎత్తున పాల్గొన్నారు. రక్తదానం, మానవతా సేవల ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
Prajavartha Online Telugu News