Breaking News

ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ, డైరెక్టర్లతో భారత్‌–డెన్మార్క్‌ ఇంధన భాగస్వామ్య ప్రతినిధుల సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత్‌–డెన్మార్క్‌ ఇంధన భాగస్వామ్యం (INDEP)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలతో నిర్వహిస్తున్న మూడు రోజుల సాంకేతిక చర్చల్లో భాగంగా మంగళవారం విజయవాడలోని ఏపీసీపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో సీఎండీ, డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో డెన్మార్క్‌ ప్రతినిధి బృందం సమావేశమైంది.
ఈ సందర్భంగా విద్యుత్‌ రంగంలో పునరుత్పాదక ఇంధన వనరుల అనుసంధానం, విద్యుత్‌ వ్యవస్థల అభివృద్ధి, నిర్వహణ, గ్రిడ్‌ ప్రణాళిక తదితర అంశాలపై ఇరు పక్షాలు సాంకేతిక చర్చలు జరిపాయి. ముఖ్యంగా అధిక శాతం పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్‌లో సమర్థవంతంగా అనుసంధానం చేయడం, విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలను భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంపై అనుభవాలు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకున్నారు.
భారత్‌–డెన్మార్క్‌ ఇంధన భాగస్వామ్యం (INDEP) అనేది స్వచ్ఛ ఇంధన మార్పిడి, పునరుత్పాదక ఇంధన విస్తరణ, గ్రీన్‌ టెక్నాలజీల అభివృద్ధి లక్ష్యంగా భారత ప్రభుత్వం, డెన్మార్క్‌ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక భాగస్వామ్యం. ఇండో–డానిష్‌ గ్రీన్‌ స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌లో భాగంగా 2020 జూన్‌ 5న తొలి అవగాహన ఒప్పందం కుదిరింది. 2020–2024 మధ్య మొదటి దశలో సామర్థ్య నిర్మాణం, పవన విద్యుత్‌, ఇంధన మోడలింగ్‌ తదితర అంశాలపై కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం 2025–2029 వరకు రెండో దశ (INDEP-II) కొనసాగుతోంది. ఇందుకోసం 2025 మేలో పునరుద్ధరించిన అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ భాగస్వామ్యం భారత ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖ, డెన్మార్క్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య ప్రభుత్వ స్థాయి సహకారంగా కొనసాగుతోంది. డానిష్‌ ఎనర్జీ ఏజెన్సీ (DEA), భారత కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ (CEA)తో కలిసి సాంకేతిక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్‌ సంస్థల మధ్య పరస్పర అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విధానాల మార్పిడికి అవకాశం కలుగుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌లు, ప్రజెంటేషన్లు నిర్వహించగా, ప్రస్తుతం భారత విద్యుత్‌ పంపిణీ సంస్థలతో ప్రత్యక్ష సాంకేతిక చర్చలు, అనుభవాల మార్పిడి కోసం వన్‌-టు-వన్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
చర్చల్లో భాగంగా అమరావతి నూతన రాజధాని ప్రాంతంలో 33 కేవీ గ్రిడ్‌ ప్రణాళిక, గ్రిడ్‌ సామర్థ్య నిర్ధారణ (డైమెన్షనింగ్‌), డిస్ట్రిబ్యూటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ (DRE) అనుసంధానం, డిస్ట్రిబ్యూటెడ్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ (BESS), ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (EV) ఛార్జింగ్‌ మౌలిక వసతులు తదితర అంశాలపై కూడా సాంకేతికంగా చర్చించారు.
ఈ సమావేశంలో ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి. పుల్లారెడ్డి, డైరెక్టర్‌ టెక్నికల్‌ ఆవుల మురళీకృష్ణ యాదవ్‌, డైరెక్టర్‌ ప్రాజెక్ట్స్‌ టీవీఎస్‌ఎన్‌ మూర్తి, సీజీఎం ప్రాజెక్ట్స్‌ కె. లింగమూర్తి, సీజీఎం ఆపరేషన్స్‌  సుబ్రహ్మణ్యంతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డెన్మార్క్‌ ప్రతినిధి బృందంలో డానిష్‌ ఎనర్జీ ఏజెన్సీ సలహాదారు ఆండ్రియాస్‌ సెజర్‌ ఆండర్సన్‌, గ్రీన్‌ పవర్‌ డెన్మార్క్‌ చీఫ్‌ కన్సల్టెంట్‌ జాస్మిన్‌ మెహ్మెడాలిక్‌, గ్రీన్‌ పవర్‌ డెన్మార్క్‌ కన్సల్టెంట్‌ గాండమ్‌ ఫరామర్జీ, కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ (CEA) డిప్యూటీ డైరెక్టర్‌ విద్యా సాగర్‌ పాలుడుగు పాల్గొన్నారు.
ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 2, 2026 వరకు మూడు రోజుల పాటు ఈ సాంకేతిక చర్చలు కొనసాగనున్నాయి. ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు, ఏపీఎస్‌ఎల్‌డీసీ, సీఆర్‌డీఏ అధికారులు డెన్మార్క్‌ ఇంధన రంగ నిపుణులతో వివిధ సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
భవిష్యత్తులో భారత్‌–డెన్మార్క్‌ ఇంధన రంగ సహకారాన్ని మరింత విస్తరించేందుకు అవసరమైన కీలక అంశాలను గుర్తించడంలో ఈ సమావేశాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు. ఇరు దేశాల విద్యుత్‌ సంస్థల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, అనుభవాలు, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడి ద్వారా విద్యుత్‌ రంగంలో మరింత సమర్థవంతమైన, స్థిరమైన వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు ఈ సహకారం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

AP Legislative Assembly Speaker Sri Chintakayala Ayyannapatrudu Pays Tributes to Mahatma Gandhi at Historic Pietermaritzburg Railway Station

PIETERMARITZBURG (SOUTH AFRICA), Neti Patrika Prajavartha : The Hon’ble Speaker of the Andhra Pradesh Legislative …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *