Breaking News

పిఠాపురం పట్టణం అభివృద్ధికి రూ.308.24 కోట్లు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అభివృద్ధి పనులు
-రూ. 200 కోట్లతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ
-ఏలేశ్వరం నుంచి పిఠాపురానికి తాగునీరు
-రూ. 59.52 కోట్లతో కొత్త పైప్‌లైన్, ట్యాంకుల నిర్మాణం
-పిఠాపురం పట్టణంలో దాదాపు 5 వేల కొత్త తాగునీటి కనెక్షన్లు
-త్వరలోనే సిద్ధం కానున్న తడి చెత్త ప్లాంట్
-కోట్లాది రూపాయలతో రహదారులు, కాలువల నిర్మాణం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో పిఠాపురం పట్టణ అభివృద్ధి కొత్త దిశగా పయనిస్తోంది. పట్టణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, పారిశుద్ధ్య సదుపాయాలు, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు, రహదారులు, కాలువలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పార్కుల అభివృద్ధి, తాగునీటి సరఫరా వంటి కీలక మౌలిక వసతుల కోసం మొత్తం రూ.308.24 కోట్ల విలువైన అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ భారీ నిధులు, సమగ్ర ప్రణాళికలతో పిఠాపురాన్ని ఆధునిక సదుపాయాలతో కూడిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
పిఠాపురం ప్రజల చిరకాల కోరిక అయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 120 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి పైప్‌లైన్లను నిర్మించనున్నారు. అలాగే, పట్టణంలోని ప్రధాన చెరుకుల కాలువకు ఇరువైపులా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, పిఠాపురం పట్టణంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దోమల నివారణకు తోడ్పడటంతోపాటు పట్టణ పరిశుభ్రత మెరుగుపడి, ప్రజారోగ్య పరిరక్షణలోనూ గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది. పిఠాపురం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఈ ప్రతిష్టాత్మక అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు రూ.200 కోట్ల నిధులను కేటాయించిన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు కి, సహకరించిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
రోజుకు రెండు పూటలా సురక్షితమైన తాగు నీరు
పిఠాపురం పట్టణంలో తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ. 59.52 కోట్ల భారీ బడ్జెట్‌తో పనులను వేగవంతంగా జరుగుతున్నాయి. అమృత్ 2.0లో భాగంగా రూ. 57.37 కోట్లు, టిడ్కో గృహ నిర్మాణ పథకం ఇళ్లకు నీటి సరఫరా కోసం రూ. 2.15 కోట్లను కేటాయించారు. పట్టణానికి మొత్తం 120.19 కి.మీ. పైప్‌లైన్ అవసరం కాగా, ప్రస్తుతం ఉన్న 72.90 కి.మీ. లైన్‌లో 35 కి.మీ. దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీని కోసం కొత్తగా, అదనంగా 82.29 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులను ప్రతిపాదించారు. పట్టణంలో 600 కిలోలీటర్ల సామర్థ్యం గల భారీ ఎత్తైన నీటి నిల్వ ట్యాంకు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో 400 కిలోలీటర్ల సామర్థ్యం గల నీటి నిల్వ ట్యాంకు నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. పట్టణ ప్రజల కోసం కొత్తగా దాదాపు 5 వేల తాగునీటి కొళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. పిఠాపురం పట్టణానికి రోజువారీ నీటి కొరత లేకుండా ఏలేశ్వరం జలాశయం నుంచి రోజుకు 55 లక్షల లీటర్ల నీటిని తరలించేందుకు ఒక ప్రధాన పైప్‌లైన్ ఏర్పాటు జరుగుతోంది. పిఠాపురం పట్టణ ప్రజల రోజువారీ నీటి అవసరమైన 80 లక్షల లీటర్లను దృష్టిలో ఉంచుకుని, రోజుకు రెండు పూటలా సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణకు ఏర్పాట్లు
పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో పట్టణ పరిశుభ్రత, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ కింద పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రూ. 4 కోట్లతో తడి చెత్త నిర్వహణ కేంద్రం, రూ.1.43 కోట్లతో మల వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. తడి చెత్త నిర్వహణ కేంద్రం పనులు మరో రెండు నెలల్లో పూర్తికానున్నాయి. పట్టణంలోని 18,468 ఇళ్ల నుంచి ప్రతిరోజూ 25 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. తడి చెత్త నిర్వహణ కేంద్రం పనులు వేగవంతం అవుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే రోజుకు వచ్చే 25 టన్నుల చెత్తను పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే పట్టణంలో గతంలో పేరుకుపోయిన భారీ మొత్తంలో ఘన వ్యర్థాలను కూడా గణనీయంగా తగ్గిస్తున్నారు. ఈ పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెత్త సమస్య తగ్గడంతోపాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయి.
రూ. 21.82 కోట్లతో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు
పట్టణంలో మురుగు నీటి సమస్య పరిష్కారానికి రూ. 21.82 కోట్లతో రెండు భారీ మురుగునీటి శుద్ధి కేంద్రాల (STP) నిర్మాణ పనులను ప్రారంభించారు. డ్రైవర్స్ కాలనీలో రోజుకు 42 లక్షల లీటర్ల సామర్థ్యంతో రూ. 11.76 కోట్లతో, మసీదు మన్యంలో రోజుకు 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో రూ. 10.06 కోట్లతో ఈ కేంద్రాలను నిర్మించనున్నారు. ఈ రెండు ప్లాంట్లు అందుబాటులోకి వస్తే, పట్టణంలోని మురుగు నీటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయడానికి వీలవుతుంది.
రహదారులు, కాలువల పనులకు ప్రాధాన్యం
పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో రోడ్లు, కాలువలు, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులను కేటాయించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 2020-21 నుంచి 2025-26 వరకు పిఠాపురం పురపాలక సంఘానికి మొత్తం రూ. 19.43 కోట్ల నిధులు కేటాయించారు. వీటిలో 2024 జూన్ తర్వాత విడుదలైన అన్‌టైడ్ గ్రాంట్ రూ. 5.15 కోట్లతో రహదారులు, మురుగునీటి కాలువలు, చిన్న వంతెనల పనులు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పూర్తికాగా, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ సహాయంతో కూడా పలు అభివృద్ధి పనులు సాగుతున్నాయి. పట్టణాభివృద్ధి సంస్థ నిధులతో మురుగునీటి కాలువలకు రూ. 1.75 కోట్లు, పట్టణ ప్రణాళిక నిధులతో రహదారులు, కాలువలకు రూ. 3 కోట్లు, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ నిధులతో కాలువలకు రూ.5 కోట్లు కేటాయించారు. ఈ పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. ఎంపీలాడ్స్ నిధులతో రూ. 50 లక్షల విలువైన మురుగునీటి కాలువ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రాజీవ్ గృహకల్ప అపార్ట్‌మెంట్ల వద్ద ప్రత్యేక నిధులతో రూ. 50 లక్షల భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అదే విధంగా పట్టణాభివృద్ధి సంస్థ నిధులతో రూ.1.50 కోట్లతో ఆదర్శ రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా రూ.2.10 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవనానికి, అలాగే రూ. 60 లక్షలతో నిర్మించనున్న సీఎస్‌ఆర్ పార్కు పనులకు సాంకేతిక అనుమతులు లభించాయి. ఈ పనులన్నీ పూర్తయితే పిఠాపురం పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఈ అభివృద్ధి పనులు అన్నీ పూర్తయితే పిఠాపురం పట్టణ మౌలిక వసతుల్లో గణనీయమైన మార్పు రావడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్ర కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు

-రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోలవరం ఎడమ కాలువ ఫస్ట్ ఫేజ్‌కు జలహారతి -ఎల్‌ఎంసీతో విశాఖకు తాగునీరు, పారిశ్రామిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *