-పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ గోదావరి జలాలు
-నాలుగు నదుల్ని దాటుకుంటూ.. తూర్పు కనుమల్లో దారి చేసుకుంటూ గోదారి
-2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్ష మందికి తాగునీరు అందేలా ప్రణాళిక
-వచ్చే ఏడాది విశాఖ వరకూ..ఆపై ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానం
-రేపు పాయకరావుపేటలో గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు జల హారతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదారమ్మ ఉత్తరాంధ్రవైపు పరుగులు పెట్టనుంది. నాలుగు నదుల్ని దాటుకుంటూ … తూర్పు కనుమల్లో దారి చేసుకుంటూ గోదారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి కదలి రానుంది. రేపు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చిన గోదావరి జలాలకు హారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. కాలువపై నిర్మించిన రెగ్యులేటర్ ను ఆన్ చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు విడిచి పెట్టనున్నారు. రేపు మధ్యాహ్నం 2.20 గంటలకు పాయకరావుపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రి..
పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే జలాలకు జల హారతి ఇచ్చి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ఏడాదిలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లు తీసుకెళ్తామని సంకల్పం చేసిన సీఎం ఇచ్చిన హామీని నెరవేరుస్తూ నీటిని విడుదల చేయనున్నారు.
నదులు.. కొండలు దాటుకుని గోదావరి పరుగులు
ప్రస్తుతం ఎడమ ప్రధాన కాలువ ద్వారా విడిచి పెడుతున్న నీటి ద్వారా మొత్తం నాలుగు జిల్లాల పరిధిలోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 5.23 లక్షల మంది దాహార్తి తీరనుంది. ఎడమ కాలువ నిర్మాణం కోసం ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.4,192 కోట్ల ఖర్చు చేసింది. పోలవరం ఎడమ కాలువ ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలు ఈ జిల్లాల్లో ఉన్న పంపా, తాండవ, వరాహ, శారద నదుల్ని దాటుకుని, ఏలేరు కాలువ, తూర్పు కనుమలపై సంక్లిష్టమైన నిర్మాణాల మీదుగా ఉత్తరాంధ్రకు చేరుకోనున్నాయి. పోలవరం ఎడమ కాల్వ నిర్మాణంలో భాగంగా వివిధ నదీ ప్రవాహాల వద్ద సైఫన్లు.. అక్విడెక్టులను జలవనరుల శాఖ నిర్మించింది. ఈ నదుల ప్రవాహానికి కొన్ని చోట్ల ఎగువన..ఇంకొన్ని చోట్ల ప్రవాహానికి దిగువ నుంచి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణం జరిగింది. ఏలేరు నది బెడ్ లెవల్ కు దిగువన గోదావరి జలాలను తరలించేందుకు సైఫన్ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. పంపా నది ఎగువ నుంచి అక్విడక్ట్ నిర్మించి పోలవరం ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలకు ఇంజనీర్లు మార్గం సుగమం చేశారు. పంపా నదిపై అక్విడెక్ట్ నిర్మాణానికి 30 మీటర్ల లోతు వరకు 312 పైల్స్‌తో పునాదుల వేసి అక్విడెక్ట్ ను నిర్మించారు. 10,634 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని తట్టుకునేలా తాండవ నదిపై 6 వెంట్లతో 447 మీటర్ల పొడవున అక్విడక్టు నిర్మాణం జరిగింది.
భవిష్యత్తులో 8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
ప్రస్తుతం ఎడమ కాల్వ ద్వారా విడుదల చేస్తున్న గోదావరి జలాలతో అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది. పాయకరావుపేట అక్విడెక్టు నుంచి సీఎం విడుదల చేయనున్న జలాలు అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జలవనరుల శాఖ ప్రణాళిక చేసింది. గోదావరి జలాలతో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడి గెడ్డ ఆయకట్టు పరిధిలో ఉన్న 46,620 ఎకరాల స్థిరీకరణ జరగనుంది. మొత్తంగా 23.44 టీఎంసీల గోదావరి జలాలు సాగు, తాగు నీటితో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు వినియోగించేలా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానించేలా 213 కిలోమీటర్ల పొడవున పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం ద్వారా అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతిపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకు గోదావరి నీరు తరలించేలా ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. తద్వారా ఎడమ ప్రధాన కాలువ సహా ఉత్తరాంధ్రలో జిల్లాల్లో మొత్తం 8 లక్ష ఎకరాలకు సాగునీరు, ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
Prajavartha Online Telugu News