-రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోలవరం ఎడమ కాలువ ఫస్ట్ ఫేజ్‌కు జలహారతి
-ఎల్‌ఎంసీతో విశాఖకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి భద్రత
-రెండేళ్లలో ఎల్‌ఎంసీ పనులను పూర్తి చేశాం-మంత్రి నిమ్మల రామానాయుడు
అనకాపల్లి జిల్లా – పాయకరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్ర ప్రజలు గత 20–30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న గోదావరి జలాల కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ (ఎల్‌ఎంసీ) ఫస్ట్ ఫేజ్‌కు జలహారతి కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే మహత్తర కార్యక్రమం రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కానుందని తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఎల్‌ఎంసీ పనుల్లో అనేక క్లిష్టమైన సమస్యలను అధిగమించి ఫస్ట్ ఫేజ్ పనులను పూర్తి చేసిందన్నారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణంలో ఏలేరు, పంపా, తాండవ, శారద, వరాహ వంటి ఐదు ప్రధాన నదులను దాటుకుంటూ కాలువను నిర్మించామని మంత్రి తెలిపారు. అదేవిధంగా 11 ప్రాంతాల్లో నేషనల్ హైవేలను క్రాస్ చేస్తూ పనులు పూర్తి చేశామన్నారు. కుమ్మరిలోవ వద్ద ఎన్నో ఏళ్లుగా ఉన్న భూసేకరణ సమస్యను పరిష్కరించి, అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో సుమారు 100 మీటర్ల లోతు వరకు కొండను కట్ చేసి కాలువ నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు.
వేలాది నిర్మాణాలు, భూసేకరణ సమస్యలు, ఇతర సాంకేతిక అవాంతరాలను అధిగమించి రెండేళ్లలోనే ఎల్‌ఎంసీ ఫస్ట్ ఫేజ్ పనులను పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.
ఐదేళ్లలో ఎల్‌ఎంసీపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం
2019–2024 మధ్య ఐదేళ్ల పాలనలో పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి ఒక్క తట్ట మట్టి పని కూడా జరగలేదని, ఒక్క రూపాయి పని కూడా చేయలేదని మంత్రి విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే క్లిష్టమైన పనులను పూర్తి చేసి, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడం ప్రారంభించిందన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎల్‌ఎంసీ జీవనాడి
పోలవరం ఎల్‌ఎంసీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి జీవనాడిగా మారనుందని మంత్రి అన్నారు. ఎల్‌ఎంసీ ద్వారా విశాఖపట్నం నగరానికి తాగునీరు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నీరు, భవిష్యత్‌లో రానున్న పరిశ్రమలకు అవసరమైన నీటి భద్రత కల్పించవచ్చన్నారు.
నీరు, పరిశ్రమలు, పెట్టుబడులతో ఉత్తరాంధ్రలో కొత్త అభివృద్ధి శకం ప్రారంభం కానుందని తెలిపారు. గతంలో ఉత్తరాంధ్ర నుంచి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని, నేడు ఉత్తరాంధ్రకే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
పోలవరం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా గోదావరి జలాలు
2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది కూటమి ప్రభుత్వ సంకల్పమని మంత్రి తెలిపారు. అయితే పోలవరం పూర్తయ్యే వరకు ఉత్తరాంధ్ర ప్రజలు వేచి చూడాల్సిన అవసరం లేకుండా పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా ఎల్‌ఎంసీకి నీటిని అందిస్తున్నామని చెప్పారు.
నాడు పురుషోత్తపట్నం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులను వ్యతిరేకించిన వారు, అధికారంలోకి వస్తే పంపులు పీకేస్తామని చెప్పారని మంత్రి విమర్శించారు. అయితే నేడు అదే పురుషోత్తపట్నం ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందుతున్నాయని తెలిపారు.
పుష్కర లిఫ్ట్ పునర్నిర్మాణానికి రూ.29 కోట్లు
పోలవరం ఎల్‌ఎంసీ పనుల్లో భాగంగా పుష్కర లిఫ్ట్‌కు సంబంధించిన పంపులను తొలగించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రూ.29 కోట్లతో పుష్కర లిఫ్ట్ పునర్నిర్మాణ పనులు చేపట్టామని, పనులు పూర్తయితే అదనంగా 700 నుంచి 1,500 క్యూసెక్కుల వరకు నీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
ఉత్తరాంధ్రలో 11 ప్రాధాన్యతా ప్రాజెక్టులకు ప్రాధాన్యత
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, రాబోయే రెండేళ్లలో ఆయా ప్రాజెక్టులపై రూ.2,500 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
మూడు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న నేరడి బ్యారేజీకి అవసరమైన అనుమతులను కూటమి ప్రభుత్వం సాధించిందన్నారు. రాబోయే 3–4 నెలల్లో నేరడి బ్యారేజీ పనులను పట్టాలెక్కించి ఉత్తరాంధ్ర చిరకాల కలను సాకారం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కృష్ణా జలాలు ప్రకాశానికి.. గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు
వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కృష్ణా జలాలను తరలించామని, ఇప్పుడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా, గోదావరి జలాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా మళ్లిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార భగీరథుడిలా పనిచేస్తున్నారని కొనియాడారు.
టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి ఉత్తరాంధ్ర గుండెకాయ లాంటిదని, ఈ ప్రాంత అభివృద్ధికి నీరు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఉత్తరాంధ్రకు గోదావరి జలాల రాకతో సాగు, తాగునీరు, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడి ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News