విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిటైల్ సరఫరా ధరల ఉత్తర్వులలో విద్యుత్ పంపిణీ సంస్థలకు మండలి జారీ చేసిన నిర్ధిష్ట ఆదేశాలు అలాగే అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క పూర్వపు మండలి జారీ చేసిన మార్గదర్శకాలు/నిర్దేశాలు, విద్యుత్ పంపిణీ సంస్థల సంవత్సరం వరకు వ్యవధి గల ప్రస్తుత స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లను నియంత్రిస్తున్నాయి. పునరుత్పాదక వనరుల నుండి విద్యుత్ పెరిగినప్పటికి (మొత్తం స్థాపించిన సామర్థ్యంలో వీటి వాటా 50 శాతం), వాటి నుండి లభ్యమైయ్యే విద్యుత్ స్థిరంగా ఉండకపోవడం మరియు ఆశించినంత విద్యుత్, పునరుత్పాదక వనరులు ముఖ్యంగా సౌర, వాయు విద్యుత్ కేంద్రాల నుండి రానప్పుడు, కొరతను తీర్చడానికి పంపిణీ సంస్థలు విపణి నుండి స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్ధ్యం పెరగడం వలన, మొత్తం విద్యుత్ కొనుగోళ్లలో స్వల్పకాలిక కొనుగోళ్ల వాటా కూడా పెరుగుతూ వస్తుంది. అంతే కాకుండా, పునరుత్పాదక ఇంధన వనరుల నుండి, ముఖ్యంగా పవన మరియు సౌర విద్యుత్ కేంద్రాల నుండి తక్కువ ధరలు గల విద్యుత్ లభించడం మరియు ఉద్గార స్థాయిలను తగ్గించడానికి పారిస్ ఒప్పందంలో భారత ప్రభుత్వం కట్టుబడడం వంటి కారణాల దృష్ట్యా రాష్ట్రంలో భవిష్యత్తులో వీటి నుండి ఎక్కువ విద్యుత్ సామర్ధ్యం జోడించే అవకాశం ఉన్నందున, మొత్తం విద్యుత్ కొనుగోళ్లలో స్వల్పకాలిక విద్యుత్ వాటా భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది.
పైన పేర్కొన్న విషయాలు మరియు కొనుగోళ్ల ప్రక్రియను క్రమబద్ధీకరించడం, స్పష్టమైన మార్గదర్శకాలను అందించడం, పారదర్శకతను పెంపొందించడం మరియు విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని, ‘ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు/అమ్మకాలకు సంబంధించిన నిబంధనలు మరియు షరతులు) నిబంధన, 2022’ను మండలి తేదీ 10.02.2022న ఆంధ్రప్రదేశ్ అసాధారణ గెజిట్లో ప్రజా సంప్రదింపుల ప్రక్రియ తర్వాత ప్రచురించింది. ఈ విధమైన నిబంధన దేశంలోనే మొదటిది.
పారదర్శకత కోసం, ఎస్ఎల్ డిసి పంపిణీ సంస్థలకు తెలిపే నెలవారీ/వారం/తరువాత రోజు విద్యుత్ అవసరాలను మరియు పంపిణీ సంస్థల పై విద్యుత్ కొనుగోళ్ల వివరాలను ఎస్ఎల్ డిసి మరియు పంపిణీ సంస్థల వెబ్సైట్లలో 48 గంటలలోపు ప్రస్తుత మరియు పాత సమాచారం సులువుగా అందుబాటులో ఉంచాలని ఈ నిబంధన నిర్దేశిస్తుంది. అంతే కాకుండా, పై సమాచారాన్ని క్రమానుగతంగా మండలికి సమర్పించాలి. ఈ నిబంధన ఆమోదించబడిన థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి వాటి పూర్తి సామర్ధ్యం మేరకు చవకైనా విద్యుత్ పొందేలా చేసి విద్యుత్ కొనుగోళ్ల ఖర్చును తగ్గిస్తుంది. రిజర్వ్ షట్డౌన్ చేయడం, కృత్రిమ మేధ ఆధారంగా విద్యుత్ అవసరాలు అంచనా వేయడం మరియు పంపిణీ సంస్థలు విఫణి నుండి విద్యుత్ కొనుగోలు/అమ్మకాన్ని ఎప్పుడు చేయాలనే విధానాలను ఈ నిబంధన నిర్దేశిస్తుంది. ఎక్స్ఛేంజీలలో విద్యుత్ ధరలను నిరంతరం పర్యవేక్షించడానికి మరియు కొనుగోలు ఖర్చు ఆదా చేయడానికి సరైన సమయంలో విద్యుత్ కొనుగోలు/అమ్మకాలు జరపడానికి అధికారాలు కలిగిన నిరంతరం (24×7) పనిచేసే ఒక ఉమ్మడి ప్రత్యేక సెల్ ను పంపిణీ సంస్థలు ఏర్పాటు చేయడానికి ఈ నిబంధన ఆదేశిస్తుంది.
విద్యుత్ పంపిణీ సంస్థల యొక్క మొత్తం విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించడం ద్వారా వినియోగదారులకు మేలు చేయడం మరియు వినియోగదారుల విస్తృత ప్రయోజనాల కోసం పంపిణీ సంస్థల సమర్ధతని పెంపొందించటం లాంటి మండలి తీసుకున్న పారదర్శక చర్యలలో ఈ నిబంధన ఒక భాగం. ఈ నిబంధనను మండలి యొక్క వెబ్సైట్ నుండి పొందవచ్చు. అంతేకాకుండా, పంపిణీ సంస్థల యొక్క పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్దారించటం కోసం వారి వెబ్సైట్లలో పనితీరు ప్రమాణాల సమాచారం సహా మొత్తం నియంత్రణ సమాచారాన్ని ఉంచాలని మండలి ఇటీవల పంపిణీ సంస్థలను ఆదేశించింది.