-సహాయక చర్యల పర్యవేక్షణ
-చెత్త తరలింపు వేగవంతం చేయాలి
-శానిటరీ సిబ్బందికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజిత్ సింగ్ నగర్లోని ఎక్సల్ ఫ్యాక్టరీ సమీపంలోని డంపింగ్ యార్డులో చెత్త తగులబడిన ప్రాంతాన్ని ఆదివారం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు సందర్శించారు. స్థానిక నాయకులతో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు, మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన గత 3 రోజులుగా అగ్నిమాపక సిబ్బంది, వీఎంసీ సహా పలు శాఖల అధికారులు సమన్వయంతో చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. డంపింగ్ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలోని చెత్తను ఇప్పటికే గుంటూరు డంపింగ్ యార్డుకు తరలించే ప్రక్రియ ప్రారంభమైందని.. పాత చెత్తను కూడా వీలైనంత త్వరగా తొలగించవలసిందిగా శానిటరీ సిబ్బందికి సూచించారు. ఈ ప్రాంతంలో ఆకతాయిలు, గంజాయి బ్యాచ్ సంచరించకుండా గట్టి నిఘా పెంచాలని.. అప్పుడే ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉంటాయని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో గోడ నిర్మాణం చేపట్టడంతో పాటు గ్రీనరీని అభివృద్ధి పరుస్తామని ఈ సందర్భంగా స్థానికులకు హామీనిచ్చారు. ఎమ్మెల్యే వెంట నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, హఫీజుల్లా, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నేరెళ్ల శివ, సురేష్, అఫ్రోజ్, కొండలరావు తదితరులు ఉన్నారు.