-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దామోదరం సంజీవయ్య శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఆలీ ఖాన్ మరియు కిర్నూల్ జిల్లా నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దళిత బడుగు బలహీన వర్గాలకు దామోదరం సంజీవయ్య చేసిన సేవలను కొనియాడారు. సోమవారం కర్నూలులో సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో వైసీపీ ఎంపీలు మోడీ వద్ద మెడలు వంచి నమస్కారాలు చేస్తున్నారని మండి పడ్డారు. నాలుగు పదుల వయసు రాకుండానే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అంతకు మునుపే రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, కాంగ్రెసుకు రెండుసార్లు జాతీయ అధ్యక్షునిగా ఆయన నిర్వర్తించిన బాధ్యతలు, ప్రజలకు చేసిన సేవలు అద్భుతం, ఆదర్శప్రాయం అని శైలజనాథ్ కొనియాడారు. ఆయన చేసిన సేవలు ఇప్పటికీ ఎవరూ చేరుకోనంత సమున్నతంగా ఉన్నాయంటే ఆయనలోని దార్శనికతకు జేజేలు పలకవలసిందే. అణగారిన వర్గాల వారికి ఆరు లక్షల ఎకరాల భూముల్ని అందించిన భూదాతగా కీర్తి గడించారు. వృద్ధాప్యపు పెన్షన్లు, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన సంక్షేమశీలి. మద్యనిషేధ విభాగం, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటుచేసిన సంస్కర్త. కాపులకు రిజర్వేషన్లను అందించిన కాపు భాంధవుడు అని శైలజనాథ్ పేర్కొన్నారు.