-రాజీవ్ నగర్లో వైభవంగా శ్రీ షిర్డి కృష్ణసాయి బాబా 13 వ వార్షికోత్సవ మహోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం రాజీవ్ నగర్లోని శ్రీ షిర్డి కృష్ణసాయి బాబా వారి 13 వ వార్షికోత్సవ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారికి ఉదయం కాగడా హారతి, క్షీరాభిషేకం, అన్ని నదులు పుణ్య జలాలతో జలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం గులాబీలతో సహస్రనామార్చన పూజా కార్యక్రమం, అమృత వర్షిణి గోష్ఠి వారిచే సాయి సత్చరిత్ర పారాయణం జరిగాయి. సాయంత్రం రథోత్సవము, షిర్డి సాయి జ్యోతి మహోత్సవము కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. పీఠాధిపతుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతి సంవత్సరం బాబా వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావం, దైవ చింతన పెరగాలని.. భక్తితో మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. తద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. బాబా దివ్యాశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని వేడుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్ రవి, పసుపులేటి ఏసు, వెంకట్రావు, నాగు, శ్రీను, సామ్రాజ్యం, ఆలయ కమిటీ అధ్యక్షులు పులప సత్యనారాయణ, అచ్యుతరావు, కోలా శ్రీను, చిక్కాల కనకారావు, పసుపులేటి తిరుపతి, ఆలయ అర్చకులు తాతాచార్యులు తదితరులు పాల్గొన్నారు.