కిడ్నీ మార్పిడి చికిత్సల కోసం ప్రత్యేకంగా డాక్టర్ శరత్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఎస్.ఐ.ఎన్.యు) ప్రారంభం


-నెఫ్రాలజీ, యూరాలజీ వైద్య సేవలు ఒకేచోట..
-విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ ప్రస్థానంలో మరో మైలురాయి
-ప్రఖ్యాత యూరోరేడియాలజిస్ట్ డాక్టర్ జి. ప్రశాంతి నేతృత్వంలో ప్రశాంతి ఇమేజింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్
-అత్యున్నత వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడం అభినందనీయం
-సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు
-మూత్రపిండాలు, మూత్రకోశ వ్యాధులకు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు
-ఎస్.ఐ.ఎన్.యు అధినేత, ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ జి. శరత్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కిడ్నీ మార్పిడి చికిత్సల కోసం ప్రత్యేకంగా నెలకొల్పబడిన డాక్టర్ శరత్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలకు సంబంధించిన వైద్య సేవలను ఒకేచోట అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ జి. శరత్ బాబు ఎస్.ఐ.ఎన్.యుకు రూపకల్పన చేశారు. నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల మన్ననలను అందుకున్న విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ ప్రస్థానంలో మరో మైలురాయిగా పేర్కొనదగిన శరత్స్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, స్వాతి పత్రిక సంపాదకులు వేమూరి బలరాం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. అత్యున్నత స్థాయి వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డాక్టర్ శరత్ బాబు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. 300లకు పైగా కిడ్నీ మార్పిడి చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి, అనితర సాధ్యమైన ఘనతను సాధించిన డాక్టర్ శరత్ బాబు ఆధ్వర్యంలో నెఫ్రాలజీ, యూరాలజీ చికిత్సల కోసం ప్రత్యేక వైద్య సంస్థ ప్రారంభం కావడం హర్షదాయకమని పేర్కొన్నారు. శరత్స్ ఇనిస్టిట్యూట్ కు అనుసంధానంగా, డాక్టర్ జి. ప్రశాంతి నేతృత్వంలో వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని నెలకొల్పడం పట్ల ఎమ్మెల్యే విష్ణు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విఖ్యాత నెఫ్రాలజిస్ట్, చండీగఢ్ పీజీఐఎంఈఆర్ పూర్వ డీన్ డాక్టర్ వినయ్ సఖుజా మాట్లాడుతూ.. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏపీలో కిడ్నీ మార్పిడి చికిత్సలకు చిరునామాగా తీర్చిదిద్దిన డాక్టర్ శరత్ బాబు ప్రత్యేకంగా నెఫ్రాలజీ, యూరాలజీ హాస్పిటల్ ను నెలకొల్పడం సంతోషంగా ఉందని అన్నారు. ఎప్పటికప్పుడు అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం అభినందనీయమని కొనియాడారు. అంతర్జాతీయస్థాయి పరికరాలు, అంకితభావం కలిగిన వైద్య నిపుణులతో నెలకొల్పబడిన శరత్స్ ఇనిస్టిట్యూట్ దేశంలోని అత్యత్తమ వైద్య సంస్థల్లో ఒకటిగా ఖ్యాతి గడిస్తుందని డాక్టర్ వినయ్ సఖుజా పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ జి. శరత్ బాబు మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే ఏకైక లక్ష్యంతో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నెలకొల్పామని, ఆ క్రమంలోనే మూత్రపిండాలు, మూత్రకోశ వ్యాధుల చికిత్సల కోసం ప్రత్యేకంగా శరత్స్ ఇనిస్టిట్యూట్ ను స్థాపించామని అన్నారు. ఎస్.ఐ.ఎన్.యు ప్రాంగణంలోనే హైఎండ్ ప్రమాణాలతో ప్రశాంతి ఇమేజింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ను ప్రారంభించామని ప్రకటించారు. అత్యాధునికమైన 30 ఫ్రెసినియస్, నిప్రో మెషీన్లతో 24/7 నిరంతర హీమోడయాలసిస్ విభాగం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆటోఇమ్యూన్ వ్యాధుల చికిత్సల కోసం ప్లాస్మాఫెరసిస్ యూనిట్, పాయిజనింగ్ కేసుల చికిత్స కోసం హీమోపర్ఫ్యూషన్ సదుపాయాలున్నాయని వెల్లడించారు. వేర్వేరు బ్లడ్ గ్రూపులున్నపుడు ఏబీవో ఇన్కాంపటబుల్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్, క్రాస్ మ్యాచ్ పాజిటివ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అత్యంత క్లిష్టమైన చికిత్సల కోసం శరత్స్ ఇనిస్టిట్యూట్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దామని వివరించారు. అన్ని రకాల ప్రోస్టేట్ ఆపరేషన్లు, యూరినరీ చికిత్సలు తమ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శరత్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కె. ప్రశాంత్ కుమార్, నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎన్. అమ్మన్న, న్యూఢిల్లీ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెఫ్రాలజిస్టు, ప్రొఫెసర్ దేబబ్రత ముఖర్జీ, మమత మెడికల్ కాలేజీ రేడియాలజీ విభాగం పూర్వ అధిపతి డాక్టర్ బాలకోటేశ్వరరావు, ఆంధ్ర హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ పి.వి. రమణమూర్తి, శరత్స్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, ప్రముఖ యూరోరేడియాలజిస్ట్ డాక్టర్ జి. ప్రశాంతి, ఎస్.ఐ.ఎన్.యు వైద్య నిపుణులు డాక్టర్ జి. అన్వేష్, డాక్టర్ ఎన్. హరిప్రసాద్, డాక్టర్ కె. ధీరజ్, డాక్టర్ కె. ప్రీతమ్, డాక్టర్ సీహెచ్. దుర్గానాధ్, డాక్టర్ బి. శైలజ, డాక్టర్ జి. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *