-ఎమ్మెల్యే చేతుల మీదుగా పేద విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు రూ. లక్షా 20 వేల ఉపకార వేతనాల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద విద్యార్థుల చదువులకు అండగా నిలిచేలా సామాజిక బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీ వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్ సేవలు ఆదర్శనీయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గవర్నర్ పేటలోని రూరల్ ఎంపిడిఓ మీటింగ్ హాల్ నందు పేద విశ్వ బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్య అనేది కుటుంబంతో పాటు సమాజాన్ని కాపాడుతుందని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి వెదురుపర్తి వెంకటరత్నం అని కొనియాడారు. ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేక చదువులకు దూరమవుతున్న పేద విద్యార్థులకు గత 50 ఏళ్లుగా శ్రీ వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ ఉపకారవేతనాలు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని వ్యాఖ్యానించారు. కనుక ప్రతి ఒక్కరూ విద్యకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కమిటీ సభ్యులు కూడా ఖర్చులు తగ్గించుకుని.. ఆదాయం పెంచే దిశగా రానున్న రోజుల్లో పనిచేయాలని సూచించారు. అలా పెంచిన ఆదాయాన్ని పేద విద్యార్థుల చదువులకు వినియోగించాలని కోరారు. ప్రతిఒక్కరూ చదువుకోవాలనే వెదురుపర్తి వెంకటరత్నం ఆశయాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తోందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని, పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే సదుద్దేశంతో.. అనేక పథకాలను విద్యార్థులకు జగనన్న ప్రభుత్వం చేరువ చేయడం జరిగిందన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 38,427 మంది విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని అందించామన్నారు. 14,188 వేల మంది విద్యార్థులకు పాఠశాలలు మొదలైన రోజే పుస్తకాలు, యూనిఫారాలతో సహా మొత్తం 7 రకాల వస్తువులతో కూడిన కిట్లను ‘జగనన్న విద్యాకానుక’గా అందజేయడం జరిగిందన్నారు. ఇవేగాక విద్యాదీవెన, జగనన్న గోరుముద్ధ, వసతి దీవెన వంటి పథకాలను దిగ్విజయంగా అమలుచేస్తున్నారన్నారు. కనుక ప్రతిఒక్కరూ శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 60 మంది విశ్వబ్రాహ్మణ విద్యార్థినీ విద్యార్థునులకు ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున రూ. లక్షా 20 వేల ఉపకార వేతనాలను అందజేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంతాచారి, కార్యనిర్వహణాధికారి ఎన్.అరుణ, కమిటీ చైర్మన్ శీమల నారాయణరావు, ధర్మకర్తలు కొమ్ముచంటి, కొలకలేటి రమణి, వడ్లాని పూర్ణిమలత, కోలగంటి మల్లేశ్వరి, కొమరవోలు సోమ సుందరం, నల్లగట్ల రాధ, విద్యార్థులు పాల్గొన్నారు.