-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెట్రోల్, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. గురువారం విజయవాడ లెనిన్ సెంటర్లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్, నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ మోడీ, జగన్ ఇద్దరూ ఒక్కటేనని కలిసి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. మోడీ ఆదేశాలతోనే జగన్ పన్నులు, విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలపైనే మోయలేని భారాలు మోపుతున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. పెట్రోల్ పై పన్నులు, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ, జగన్లు ఆడే జగన్నాటకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. వారం రోజుల పాటు ఈ భారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు. మోదీ మాయలో ఉన్న జగన్ కళ్లు తెరవాలని లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని శైలజనాథ్ హెచ్చరించారు.