-కన్నుల పండుగగా ఉగాది వేడుకలు….
-శ్రీనివాస క్షేత్రానికి విశేష భక్తుల తాకిడి…
-భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు…
తాడిగడప, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ శుభ కృత ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార భక్తులకు చందన అలంకరణలో దర్శనం ఇచ్చారు. నగర పరిధిలోని తాడిగడప గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వర గార్డెన్స్ లో నున్న శ్రీనివాస క్షేత్రంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి మూలవిరాట్ కు విశేష చందన అలంకారం చేశారు. చందన అలంకరణలో తేజోమూర్తి గా వెలుగొందుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రధానార్చకులు అగ్నిహోత్రం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజాము నుండే స్వామి వారికి చందన అలంకరణతో పాటు, నిత్యకైంకర్యాలు, విశేష పూజా కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించారు. అలాగే సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. విజయవాడ తో పాటు తాడిగడప చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో పాల్గొన్నారు. చందన అలంకరణలో ఉన్న స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు దేవేంద్రనాథ్, కృష్ణమోహన్, వెంకటేశ్వర్లు విస్తృత ఏర్పాట్లు చేశారు.