-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
-రాజ్ భవన్ లో ఘనంగా శ్రీ శుభకృత్ ఉగాది వేడుకలు
-జాతీయ అవార్డు గ్రహీతలను సత్కరించిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అవార్డు గ్రహీతలు మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వైద్యం, సాహిత్యం, సంగీతం, కళలు, క్రీడలు వంటి రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా పలువురు తెలుగు వారు ప్రతిష్టాత్మక అవార్డులు పొందగలిగారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఘనత సాధించినందుకు తాను గర్విస్తున్నానన్నారు. శనివారం విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో జరిగిన ‘శ్రీ శుభకృత్ ఉగాది’ వేడుకల నేపధ్యంలో జాతీయ స్ధాయి అవార్డులు దక్కించుకున్న తెలుగు ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సత్కరించారు. గౌరవ హరిచందన్ నుండి పురస్కారం అందుకున్న వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అన్నవరపు రామస్వామి, డా. సుంకర వెంకట ఆదినారాయణరావు, గరికిపాటి నరసింహారావు, దండమూడి సుమతీ రామమోహనరావు, యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావు తదితరులు ఉన్నారు. మరణానంతరం పద్మశ్రీ అవార్డు పొందిన గోసవీడు షేక్ హసన్, పద్మశ్రీ అందుకుని ఇటీవల మరణించిన దివంగత డాక్టర్ అసదవాడి ప్రకాశరావు కుటుంబ సభ్యులను కూడా గవర్నర్ శ్రీ హరిచందన్ సత్కరించారు. నారీ శక్తి పురస్కార గ్రహీత సత్తుపాటి ప్రసన్న, వికలాంగుల జాతీయ అవార్డు విజేత షేక్ జాఫ్రీన్, ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత ఎన్. ఉషను కూడా గవర్నర్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. పండుగ శుభవేళ తిరుమల తిరుపతి దేవస్ధానం పండితులు, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్దానం పండితులు గవర్నర్ దంపతులకు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదం అందించారు. శ్రీ సుభకృత్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తొలుత గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ రాజ్‌భవన్‌లోని అధికారులు, సిబ్బందితో సమావేశమై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, సంయుక్త కార్యదర్శి ఎ. శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి డి.సన్యాసిరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.