మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
`కష్టపడే వారికి ఏ గ్రహమైనా అనుకూలంగా..అనుగ్రహంగా ఉంటుందని, శ్రమ పడేవారికి విజయం తధ్యమని, నిన్నటిదాకా చేసిన తప్పులను, పొరపాట్లను పరిహరించుకుని ఈ ఉగాది నుంచి ఆశాదృక్పధంతో నూతన జీవనపథంలో పయనిస్తూ భవితపై కొత్త కాంక్షలతో ” శ్రీ శుభకృత్ ” నామ సంవత్సరాన్ని జయప్రదంగా మలుచుకోవాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ( ఆసరా ) కె. మోహన్ కుమార్ జిల్లా ప్రజలకు సూచించారు.
శనివారం ఉదయం మచిలీపట్నం కృష్ణాజిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్ లో ఉగాది ఉత్సవాలు జిల్లా రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు. తొలుత బుర్రా కృష్ణ సునంద శ్రీయ , జల్లూరి శరణ్యలు సత్యభామ కలాపం కూచిపూడి నృత్యంతో సభికులను అలరించారు. పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేదపండితులు ఆశీర్వచనం ప్రజలకు అందించారు.
ఈ వేడుకలకు అధ్యక్షత వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ( ఆసరా ) కె. మోహన్ కుమార్ మాట్లాడుతూ, ప్రకృతి అంతటా చైతన్యాన్ని నింపి, ఆహ్లాద కరమైన వాతావరణాన్ని అందించేదే ఉగాది అని ‘ఉగస్య ఆది’ ఉగాది అని చెబుతూ, ఉగ అంటే నక్షత్ర గమనమని జన్మ, ఆయుష్షు అని అర్థాలున్నాయని ఆన్నారు. వీటన్నిటికి ఆది.. ఉగాది. జన్మ, ఆయుష్షులకు మొదటిరోజుగా ఉగాదిని భావిస్తారని సనాతన సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే సృష్టి జరిగిందని పురాణ వచనం పేర్కొంటుందని తెలిపారు. చైత్ర మాసంతో కొత్త ఏడాది ప్రారంభమవుతుందని అందుకే కొత్త ఏడాది మొదటిరోజును ఉగాది పండుగ పర్వదినంగా చేసుకుంటామని వివరించారు. మన కష్టాన్ని నమ్ముకొంటూ రాబోయే రోజులలో అందరూ సానుకూల ఫలితాన్ని పొందాలని మనసారా కోరుకొంటున్నట్లు జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా బ్రాహ్మణ ప్రముఖులు యజ్ఞయాగాదులు, ప్రతిష్టలు నిర్వహించే మహా ఘనాపాటి వేద పండితులు విష్ణుబొట్ల సూర్య నారాయణ శర్మ పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణమూలానే ఐదు అంగాలను వివిరించేదే పంచాంగమన్నారు, మనది చంద్రుని సంచరణతో అనుసంధానమైన చాంద్రమాన పంచాంగమని పంచాంగకర్త, నవనాయకులు, ఉపనాయకులు, వారికి ఆధిపత్యం వహించే గ్రహాలూ, వాటిద్వారా సంవత్సరంలో కలిగే ఫలితాలతో పాటు సంక్రాంతి పురుషుడి లక్షణాలు ఫలాలు, వివిధ నక్షత్రాలు, రాశులవారి రాశిఫలాలు, ఆదాయ, వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు, సవివరంగా తెలియజేస్తారన్నారు. ప్రతిమానవుడు ఆదాయాన్ని మించి, వ్యయం చేయకుండా తొందరపాటు చర్యలతో అవమానాలపాలు పడకుండా జగ్రత్తపడే అవకాశం ఉందన్నారు. అలాగే, గ్రహాల గమనాన్ని అర్థం చేసుకుని, వాటికి తగినవిధంగా జీవనగమనాన్ని మార్చుకుంటూ, అభివృద్ధిని సాధించవచ్చన్నారు. . శుభకృత్ నామ సంవత్సరం పేరుకు తగ్గట్లుగా ఈ ఏడాది అన్ని శుభాలే ఉంటాయని ఆయన వెల్లడించారు.శుభకృత్ నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు అద్భుతంగా పండుతాయన్నారు. ఈ ఏడాదంతా అందరూ ఆనందంగా ఉంటారని తెలిపారు. ప్రజారోగ్యం బాగుంటుదని చెప్పారు. ,
మచిలీపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్ నోబుల్, మాజీ మునిసిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ జె. అన్నపూర్ణమ్మ, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, జడ్పి సిఇఓ సూర్యప్రకాశరావు, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమీషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ సునీల్ బాబు, వైస్సార్ సీపీ అధికార ప్రతినిధి మాదివాడ రాము, మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్పొరేటర్లు పర్ణం సతీష్, మహమ్మద్ రఫీ, షేక్ సాహెబ్, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు వనజాక్షి, ఎం. డి. యాకూబ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం ‘సంక్రాంతి’ …