ప్రమాద రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దుదాం…

-హెల్మెట్‌ వాడకంపై అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాణం చాలా విలువైనదని, తమపై ఆధారపడిన కుటుంబం కోసం ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను విధిగా పాటించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సుందరయ్యనగర్ లోని గాయత్రి విద్యాలయం హైస్కూల్ ఆధ్వర్యంలో హెల్మెట్‌ ధారణపై నిర్వహించిన అవగాహనా ర్యాలీని స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే చేతులమీదుగా విద్యార్థులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో చిన్నారులచే నిర్వహించబడిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. బాల్యం నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. చిన్నతనం నుంచే హెల్మెట్ ధరించడం మొదలుపెడితే.. భవిష్యత్తులో అది ఒక మంచి అలవాటుగా మారుతుందన్నారు. అలాగే రోడ్డుపై ప్రయాణించే సమయంలో సిగ్నల్ లైట్లను ఫాలో అవ్వాలని, ఎదుటి వాహనాలను ఓవర్ టేక్ చేయడం వంటివి చేయకూడదని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు పాటించి క్షేమంగా గమ్య స్థానాలకు చేరాలన్నారు. నిర్లక్ష్యం, అతివేగం అనర్ధానికి దారితీస్తుందన్నారు. హెల్మెంట్‌ ధరించి వాహనం నడపడం వల్ల అనుకోని పరిస్థితిలో ఎలాంటి ప్రమాదం వాటిల్లినా ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చన్నారు. నగరం నానాటికి విస్తరిస్తున్న తరుణంలో శివారు ప్రాంతాలన్నీ కూడా విజయవాడకు కేంద్రంగా మారుతున్నాయన్నారు. ఇటువంటి సమయంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని.. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా కండ్రిక జంక్షన్ వద్ద ఇటీవల సిగ్నలింగ్ బ్లింకర్లను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తుచేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కొందరు దాతలు కూడా తమ వంతు సాయంగా ముందుకు వస్తున్నారన్నారని వెల్లడించారు. విదేశాలలో ట్రాఫిక్ నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయని.. ఆ తరహాలో మన ప్రాంతంలో రూల్స్ ను అమలు చేస్తున్న పోలీస్ శాఖను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే నియోజకవర్గంలోని స్కూల్స్, కాలేజీలు, ఆస్పత్రులు, అపార్ట్ మెంట్లు, షాపింగ్ మాల్స్ సహా రద్దీ ప్రాంతాలలో అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసే కార్యక్రమం వీఎంసీ వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. కనుక ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ పలువురు వక్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో గాయత్రి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆకుల గోపాలకృష్ణ, మేనేజింగ్ డైరక్టర్ ఆకుల మాధవి, డైరక్టర్ ఆకుల అభిలాష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్, VHEEDU రోడ్ సేఫ్టీ ఎన్జీవో డైరక్టర్ వాసు, సీఐ హనీష్, నాయకులు సీహెచ్ రవి, ఏసు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *