-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) కె.నారాయణ స్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పలు వినూత్న పథకాలను అమలు పరుస్తూ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా నిరుపేదలకు పెద్ద ఎత్తున మేలు చేస్తుంటే, అటు వంటి పథకాల అమలు వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతున్నదని, పేదల ఆగర్బ శత్రువుల్లా మాజీ ఐ.ఏ.ఎస్.లు మాట్లాడం ఎంతో విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వీరిరువురూ కీలక పధవుల్లో పనిచేశారని, అయితే అప్పటి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి వృధాగా ఆసొమ్మును దుర్వినియోగం చేస్తుంటే వీరిరువురూ ఏంచేశారని ఆయన ప్రశ్నించారు. పోలవరం చూడటానికని, సింగపూర్ ఏజన్సీకని, అమరావతి డిజైన్ రూపొందించేందుకు అని కొన్ని వందల కోట్లు గత ముఖ్యమంత్రి ఖర్చుచేస్తుంటే వీరిరువురూ ఏంచేశారని ఆయన ప్రశ్నించారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ దేశంలో పేదరిక నిర్మూలనకై 20 సూత్రాల పథకాన్ని అమలు చేయడంలో అప్పటి ఐ.ఏ.ఎస్. అధికారి శంకరన్ కీలక పాత్ర పోషించారన్నారు. అదే విధంగా పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఏ ఐ.ఏ.ఎస్. అధికారి అయినా పనిచేస్తాడని, అయితే వీరు అందుకు విరుద్దంగా మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. పేదలు బాగుపడం వీరిరువురుకి ఏమాంత్రం ఇష్టం లేని విషయంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంత చదువుకున్న వ్యక్తులు, కీలక పదవుల్లో ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసినవారు పేదరిక నిర్మూలనకు రాష్ట్రంలో అమలు చేస్తున్న పధకాల విషయంలో ఈ విధంగా మాట్లాడం ఏమాత్రం సబబు కాదని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణంగా తెచ్చిన సొమ్మును దుబారాగా ఖర్చుచేస్తే, ప్రస్తుతం తమ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఖర్చుచేస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయాల్సిందేనని, అయితే ఆ విధంగా తెచ్చిన సొమ్మును రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఖర్చుచేస్తూ సద్వినియోగం చేయడంలోనే గొప్పతనం ఉందన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలకు దివంగత ముఖ్యమంత్రులు ఎన్.టి.రామారావు, డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పర్చారని, అదే బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నడుస్తూ పేదరికమే కొలమానంగా అన్ని వర్గాల వారికి సంతృప్తి కర స్థాయిలో పేదరిక నిర్మూల పథకాలను అందజేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందుతున్నారన్నారు.
ప్రభుత్వం పై బురద జల్లే విధంగా వీరిరువురూ ఈ విధంగా మాట్లాడటానికి ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులే కారణమని, రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అమలు చేసే పథకాలు ప్రతి పక్ష పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అగిపోతాయని వీరిరువురి స్టేట్మెంట్ ద్వారా వ్యక్తం అవుతున్నదని ఆయన స్పష్టంచేశారు.