-వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి శ్రీలంకను మించి దారుణంగా కుప్పకూలిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు విమర్శించారు. అజిత్ సింగ్ నగర్లోని షాదీ ఖానా కల్యాణ మండపం నందు 58, 59, 60 డివిజన్ల వాలంటీర్లకు నిర్వహించిన సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి, వైసీపీ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన 266 మంది వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పురస్కారాలు కేవలం వ్యక్తులకు కాదని.. మొత్తం వాలంటీర్ల వ్యవస్థకని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల గుమ్మం వద్దకు చేరుస్తున్న వారధులు వాలంటీర్లు అని కొనియాడారు. విద్య, వైద్యం, గృహ నిర్మాణం.. ఇలా అన్ని రంగాలలో ఆశించిన దానికన్నా మెరుగైన ప్రగతి సాధించగలిగామంటే ముఖ్య కారణం వాలంటీర్ల వ్యవస్థ అని కితాబిచ్చారు. డివిజన్ పర్యటనలలో ప్రతి 50 ఇళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వాలంటీర్లు వివరిస్తున్న తీరు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ప్రజలకు ఈ తరహాలో జవాబుదారీతనంగా వ్యవహరిస్తున్న వ్యవస్థను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. బహుముఖంగా పనిచేస్తున్న వ్యవస్థను చూసి పక్క రాష్ట్రాలు సైతం స్ఫూర్తిగా తీసుకుని పనిచేయడం మనందరికీ గర్వకారణమన్నారు. అటువంటి వ్యవస్థను ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్న తీరును చూస్తుంటే.. వారి మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతోందని మల్లాది విష్ణు అన్నారు.
దేశంలో విశ్వసనీయత లేని పార్టీ ఏమైనా ఉందంటే.. అది తెలుగుదేశం పార్టీనేనని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. తెలుగుదేశం సిద్ధాంతాలన్నీ ఏనాడో బూజు పట్టాయని.. అటువంటి పార్టీ మరలా రావాలని ప్రజలు ఏమాత్రం కోరుకోవడం లేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలు మెచ్చేలా అమ్మఒడి లాంటి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చంద్రబాబు ప్రవేశపెట్టలేకపోయారని.. కనీసం ఆ దిశగా ఆలోచన చేయలేదని విమర్శించారు. కానీ ఈ పథకం ద్వారా దాదాపు 44 లక్షల మంది తల్లులకు గత రెండున్నరేళ్లలో రూ. 13 వేల కోట్లు జమ చేసిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతుభరోసా ద్వారా 52 లక్షల మంది రైతులకు రూ. 20 వేల కోట్లు జమ చేసినట్లు వివరించారు. ఇలా చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క సంక్షేమ పథకం అయినా ఉందా..? అనేది ఆ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలన అంతా పారిశ్రామిక వేత్తలు, బడా బాబులకు దోచిపెట్టడానికే సరిపోయిందన్నారు. కనుకనే శ్రీలంకను మించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దారుణంగా కుప్పకూలిందని ఎద్దేవా చేశారు. నారాలోకేష్ సహా అప్పటి మంత్రులు, ఎంపీలందరూ ఘోర పరాజయం పాలైన సందర్భాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోవాలని ఆ పార్టీ నాయకులకు సూచించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విశ్వసనీయతను కోల్పోవడంతో.. చివరకు అద్దె మైకులా ఎల్లో మీడియాతో మాట్లాడిస్తున్నారన్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థలో నగదు బదిలీ పథకంపై సోము వీర్రాజు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని మల్లాది విష్ణు అన్నారు. నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతుంటే.. అవినీతి ఎక్కడ జరుగుతుందో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. మరోవైపు సచివాలయ వ్యవస్థతో పాటు ప్రజలకు మరిన్ని విస్తృత సేవలు అందించే విధంగా నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు మల్లాది విష్ణు వివరించారు. ఇప్పటికే బూత్ కమిటీలు, డివిజన్ అధ్యక్షుల నియామకాల ప్రక్రియను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. మరోవైపు మండలానికో మహిళ కాలేజీని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా.. సెంట్రల్ నియోజకవర్గంలో రెండు మహిళ కళాశాలలు త్వరలో రాబోతున్నట్లు తెలిపారు.
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదవాడికి మంచి జరుగుతుంటే చూసి ఓర్వలేక, టీడీపీ ఒక ఏడుపు పార్టీగా తయారైందన్నారు. మహిళ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు.. ఇలా ఏవి చూసుకున్నా దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని.. ఆయనొక ట్రెండ్ సెట్టర్ గా అభివర్ణించారు. అనంతరం 58వ డివిజన్ కు సంబంధించి 104 మందికి సేవామిత్ర, ఒకరికి సేవారత్న., 59వ డివిజన్ కు సంబంధించి 81 మందికి సేవామిత్రతో పాటు ఒకరికి సేవారత్న, 60వ డివిజన్ కు సంబంధించి 78 మందికి సేవామిత్ర, ఒకరికి సేవారత్న అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో 29వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, 60వ డివిజన్ వైసీపీ కోఆర్డినేటర్ బెవర నారాయణ, జోనల్ కమిషనర్ రాజు, నాయకులు అవుతు శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి వెంకట్రావు, అలంపూర్ విజయ్, బత్తుల దుర్గారావు, అఫ్రోజ్, సురేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.