-రాహుల్ గాంధీ రాజ్యం కోసం రక్తం ధార పోస్తాం
-ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విస్ఫోటనం జరగాలి
-ఈ పార్టీలను వేటాడుతాం..వెంటాడుతాం..
-అభివృద్ధికి అడ్డు వచ్చిన వారిని నిద్ర పోనివ్వం
-నాయకత్వం అంతా కార్యకర్తలదే
-కష్టాల్లో… నష్టాల్లో తోడుందేది మీరే
-రాష్ట్రంలోని నలు మూలలనుంచి ముట్టడించబోతున్నాం
-మనమంతా రాహుల్ గాంధీ సైనికులం
-ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమ్మేళనంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాహుల్ గాంధీ రాజ్యం కోసం రక్తం ధార పోస్తామని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదల హక్కుల పరిరక్షణ రాష్ట్ర స్థాయి సమ్మేళనంలో రాజ్యాధికారం కోసం తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళదామని పిలుపునిచ్చారు. డాక్టర్ సాకే శైలజనాథ్ పాల్గొని ప్రసంగిస్తూ అభివృద్ధికి ఎవరు అడ్డమో.. ప్రజల ఆస్తులను దోచుకుంటున్న ఈ పార్టీలను వేటాడతాం… వెంటాడుతామని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ పునరుద్ఘాటించారు. మనమంతా రాహుల్ గాంధీ సైనికులమని, నాయకత్వం అంతా , కష్టాల్లో… నష్టాల్లో తోడు నీడగా ఉండేది కార్యకర్తలే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నలుమూలాల నుంచి ముట్టడించబోతున్నామని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో విస్ఫోటనం జరగాలని, ఫీనిక్స్ పక్షిలా అందులోనుంచి కాంగ్రెస్ బయటకు రావాలని ఆకాంక్షించారు. దళితుల కోసం… మైనారిటీల కోసం… అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఈ పోరాటం… అధికారం కోసం కాదని శైలజనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ ఏ హక్కులు లేకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం రోడ్డు పై నిలబెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో భూములు పంచాం… ఇళ్లు కట్టించాం… మన పథకాలను పేర్లు మార్చి కొత్తవి అంటున్నారు. ప్రజా ధనాన్ని దోచుకుంటున్న ఈ దుర్మార్గ మైన ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వంలోని మంత్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గోటికి కూడా సరిపోరని స్పష్టం చేశారు.
బహుజనులకు రాజ్యాధికారాన్ని పంచేందుకు కాంగ్రెస్ సిద్ధం
అఖీల భారత ఎస్సీ, ఎస్టీ సమన్వయ కర్త కొప్పుల రాజు
కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానంలో ప్రస్ఫుటమైన మార్పును ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అఖిల భారత ఎస్సీ ఎస్టీ సమన్వయ కర్త కొప్పుల రాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ బహుజనులకు రాజ్యాధికారాన్ని పంచేందుకు సిద్ధంగా ఉందన్న స్పష్టమైన సందేశాన్ని సోనియా, గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చారని స్పష్టం చేశారు. రాజ్యాధికారం ద్వారా అధికారంలో సైతం భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ఉందన్నారు. బహుజన శకం మొదలైందని, అన్ని వర్గాల నాయకులు కలిసి పని చేయాలని కోరారు. రెండేళ్లలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆర్ ఎస్ ఎస్ ను ఏర్పాటు చేశారన్నారు కొప్పుల రాజు. దేశంలో కులాల మధ్య అసమానతలు పెరగాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగాన్ని తగుల బెట్టారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా పూర్వ వైభవం వస్తుంది
ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు పద్మరాజు
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కి తప్పకుడా పూర్వ వైభవం వస్తుందని, ఈ రెండేళ్లు అందరం కలిసి రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు శ్రమించాలి ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు అన్నారు. ప్రాంతీయ పార్టీలు కొన్ని వర్గాలకే పరిమితమవుతున్నా యని, పార్టీ అధ్యక్ష ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అప్పగించేందుకు సిద్దమా? అని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలని కాంగ్రెస్ పార్టీ ఆదరించి ఉన్నత స్థానాల్లో నిల బెట్టిందని, కుల మత బేధాలు లేకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ను ఆదరించిన విషయాన్ని గుర్తు చేశారు. దళిత దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమార్ ని స్పీకర్ చేసిన ఘనత దక్కిందన్నారు.
ఈ పార్టీలను పొలిమేరల నుంచి తరిమికొట్టాలి
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి
ప్రజలకు శని గ్రహం లా దాపురించిన ఈ ప్రాంతీయ పార్టీ లను ఆంధ్ర ప్రదేశ్ పొలిమేరల నుంచి తరిమికొట్టాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పిలుపునిచ్చారు. విభజన చట్టంలో రావాల్సిన రో.5 లక్షల కోట్ల విలువ చేసే ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక సాయం, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే, తెచ్చే శక్తి ఈ పార్టీ లకు లేదని విమర్శించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ని, ముగ్గురూ మోడీ చేతిలో కీలు బొమ్మలు గా మారారని ధ్వజమెత్తారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని, 2024లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు.
మతోన్మాదం తో దేశాన్ని చీల్చే కుట్ర
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదం తో దేశాన్ని చీల్చే కుట్ర చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఆరోపించారు. మజ్లీస్ పార్టీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీ టీమ్ గా మారిందని విమర్శించారు. విభజన చట్టం లోని హామీలను నెరవేర్చకున్నా మోడీ వద్దకు వెళ్ళి ప్రశ్నించకుండా జీ హుజూర్ అంటున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీలను రెండో తరగతి పౌరులుగా చూడడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. మేధావులు మౌనం వహిస్తే మోడీ లాంటి వారితో ప్రజలకు ఎంతో ప్రమాదమని హెచ్చరించారు.
ఈ సమ్మేళనంలో ఎస్సీసెల్ చైర్మన్ కొరివి వినయ్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు మెయ్యప్పన్, క్రిస్టోఫర్తిలక్, సిరివెళ్ళ ప్రసాద్, మైనారిటీ సెల్ చైర్మన్ దాదా గాంధీ, కిసాన్ సెల్ ఛైర్మన్ జెట్టి గురునాథ్ రావు, హసీనా సయ్యద్, స్పెన్సర్ లాల్, జంగా గౌతమ్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్), పరస రాజీవ్ రతన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , 26 జిల్లాల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.